ఎందుకు తాగుతారంటే..!
లండన్: మద్యం ఎందుకు సేవిస్తారు..? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా..? ఇదే ప్రశ్న యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్రన్ ఫిన్లాండ్ శాస్త్రవేత్తలకు తలెత్తింది. దీనిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. మెదడులో కలిగే మార్పుల వల్ల జనాలు అతిగా మద్యం సేవిస్తారని గుర్తించారు. తాగుడు అలవాటు లేని వారితో పోల్చితే మద్యం సేవించే వ్యక్తుల మెదడు కణజాలంలో కొన్ని ప్రత్యేక మార్పులు చోటుచేసుకుంటాయని కనుగొన్నారు. ‘మద్యం సేవించే వారందరిలో కొన్ని ఉమ్మడి లక్షణాలుంటాయి.
తాగే వారిని టైప్-1, టైప్-2 అనే రెండు గ్రూపులుగా విభజించవచ్చు. టైప్-1 మనుషులు లేటు వయసులో, తమకున్న ఆందోళన వల్ల తాగుడు ఆరంభిస్తారు. ఇక టైప్-2 మనుషులు యుక్త వయసులో.. సంఘ వ్యతిరేక లక్షణాలు లేదా మద్యానికి ఆకర్షితులవడం వల్ల మొదలుపెడతారు. అయితే మద్యం సేవించే వారంతా ఈ రెండు గ్రూపుల కిందికే వస్తారని కచ్చితంగా చెప్పలేం. మరిన్ని గ్రూపులు కూడా ఉండొచ్చు’ అని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్రన్ ఫిన్లాండ్‌కు చెందిన ఒల్లీ కర్కైనెన్ తెలిపారు.