ట్రంప్‌కు కలసొచ్చిన కంపు మాటలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయానికి కారణాలేమిటో వివరించేందుకు అధ్యయనకారులు వివిధ రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఎదుటి వారి అంచనాలను అందని వ్యక్తి అవడమే ఆయన విజయ రహస్యం. అందుకే అమెరికా అధ్యక్షులు ఎవరవుతారనే విషయంలో అందరి అంచనాలు తలకిందులయ్యాయి.
మాట, మర్యాద, మన్నన తెల్సిన హిల్లరి క్లింటన్‌ను కాదని, ఆడవాళ్ల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ నోటి దురుసుతో దూకుడుగా వ్యవహరించిన ట్రంప్‌ను అమెరికన్లు గెలిపించడం అంటే నేటి సోషల్ మీడియా యుగంలో ఆధునికతకు పట్టం కట్టడమే. వైట్‌హౌజ్‌లో ప్రథమ మహిళగా, సెనేటర్‌గా, విదేశాంగ మంత్రిగా రాజకీయ అనుభవం ఉన్న హిల్లరీని ఓటర్లు రాజకీయ సంప్రదాయ వాదిగా భావించారు. అనాదిగా వస్తున్న పాత భావాలను కాదనుకున్న వారు ట్రంప్ పక్షాన చేరారు.
ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా కేవలం సెలబ్రెటీగా సుపరిచితులైన ట్రంప్ కంపు మాటలు ఎన్ని మాట్లాడినా కడుపులో కంపు దాచుకొని ఇంపుగా మాట్లాడడం కన్నా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడమే ఆధునిక ఇంపని ఆయన మద్దతుదారులు భావించారు. వారిలో ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేకులే ఎక్కువగా ఉన్నారు. ఇతరుల ముందు తమ అభిప్రాయాలను బయటపెట్టుకొని విమర్శలు ఎదుర్కోవడం కన్నా మౌనం వహించడమే ముఖ్యమనుకొని వారు మౌనంగానే ట్రంప్‌కు ఓటేశారు. ఈ కారణంగా మీడియాకు వారి నాడి అందలేదు.
ఇక తనదైన కంపు వ్యాఖ్యలతో ట్రంప్ మీడియాలో ఉచితంగా విస్తృత ప్రచారం పొందారు. ఆయనకు వచ్చిన ప్రచారం విలువ దాదాపు 300 కోట్ల డాలర్లు ఉంటుందని కొన్ని సంస్థలు అంచనా వేశాయి. దాదాపు 24 ఏళ్ల క్రితం 1992లో హెచ్‌డబ్ల్యూ బుష్‌ను బిల్ క్లింటన్ ఓడించడంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎలా కలసి వచ్చిందో ఇప్పుడు ట్రంప్‌కు కూడా ఒబామా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కలసి వచ్చింది. సంప్రదాయ రాజకీయాలను పాటిస్తున్న నేతలకన్నా లేటుగానైనా లేటెస్ట్‌గా వచ్చిన ట్రంప్ ఏదైన చేయగలరని నమ్మకంతో మరికొందరు ఓటర్లు చివరకు ఆయన వైపు తిరిగారు.
వలసలను, స్వేచ్చా వాణిజ్యాన్ని కట్టడి చేస్తానని, దేశీయ ఉత్పాదక రంగాన్ని అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానంటూ ఆది నుంచి ట్రంప్ చేస్తున్న ప్రచారం స్థానికులైన శ్వేతజాతీయులను ఎక్కువగా ఆకర్శించింది. వారి ఓట్ల కారణంగా డెమోక్రట్లకు బలమైన విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ట్రంప్ ఊహించని విజయాన్ని సాధించారు. గతంలో రిపబ్లికన్ల తరఫున పోటీ చేసిన జాన్ మెకెయిన్ వలసలను సమర్థించడం వల్ల, మిట్ రోమ్నీ స్వేచ్ఛా వాణిజ్యాన్ని సమర్థించడం ఈ రాష్ట్రాల్లో విజయం సాధించలేకపోవడం ఇక్కడ గమనార్హం.