లోకం చుట్టిన వీరుడు!
కేవలం 11 అంటే 11 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టొచ్చాడు ఓ 65 ఏళ్ల రష్యా వ్యక్తి. అతని పేరు ఫెడర్ కాంకోవ్. చిన్నప్పటి నుంచి సాహసాలంటే చెవికోసుకునే ఫెడర్ వృత్తి పరంగా ఒక మతబోధకుడు. రష్యాలోని ఓ చర్చిలో ఫాదర్‌గా పనిచేస్తున్న ఆయన సాహసం అనే ప్రవృత్తిని మాత్రం వదులుకోలేదు. ఏమాత్రం సమయం చిక్కినా హాట్ ఎయిర్ బెలూన్‌లో ఆకాశంలోకి వెళ్లి సరదాగా విహరించేవాడు. ఒక్కసారైనా ప్రపంచాన్ని చుట్టివచ్చే అవకాశం ఇవ్వు అని దేవుడిని తరచూ ప్రార్థించేవాడు. కాని ఒకానొక రోజు ఆయనకు ఆ అవకాశం వచ్చింది. ఇక వదిలిపెడతాడా చెప్పండి.
దాదాపు రెండు టన్నుల బరువు, 56 మీటర్ల పొడవు, హీలియంతో నడిచే భారీ హాట్ ఎయిర్ బెలూన్‌లో పెర్త్ నుంచి జూలై 12న బయలుదేరిన ఫెడర్ ప్రపంచాన్ని చుట్టేసి సరిగ్గా 11 రోజుల 6 గంటలకు తిరిగి బయలుదేరిన చోటికి చేరుకున్నాడు. 23 వేల అడుగుల ఎత్తులో విపత్కర వాతావారణాన్ని ఎదుర్కొంటూ గాలులకు తట్టుకుంటూ నిద్రలేమితో ఒంటరిగా ప్రయాణించిన ఫెడర్ అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టొచ్చిన సాహసిగా రికార్డు సృష్టించాడు. గతంలో అమెరికాకు చెందిన ఓ వ్యాపార వేత్త ఇలాంటి హాట్ ఎయిర్ బెలూన్‌లోనే 13 రోజుల 8 గంటల్లో ప్రపంచాన్ని చుట్టొచ్చాడు.