అక్కడ మహిళలు చేయకూడని పనులు
Published Sat, Dec 12 2015 8:45 PM | Last Updated on Mon, Aug 20 2018 7:33 PM
రియాద్: సౌదీ అరేబియా చరిత్రలో మొదటిసారిగా మహిళలకు ఓటింగ్ హక్కు లభించడంపై ఆ దేశ మహిళల్లో చాలా ఆనందం వ్యక్త మవుతోంది. జీవితంలో మొదటిసారి ఓటు వేయడం చాలా అద్భుతంగాఉందంటూ అనేకమంది మహిళలు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. చరిత్రలో ఇదో గొప్ప సుదినమంటూ ట్విట్టర్ లో తమ సంతోషాన్ని ప్రకటిస్తున్నారు.
2005లోనే ఈ చట్టం తెచ్చినప్పటికీ స్త్రీలకు వేరుగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు సాధ్యంకాదనే పేరుతో దాన్నెన్నడూ అమలుపరచలేదు.ఆ తర్వాత రెండుసార్లు ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఎట్టకేలకు ప్రపంచంలో స్త్రీలకు ఓటుహక్కు మానవహక్కుగా గుర్తించి 2015 స్థానిక ఎన్నికల్లో పోటీచేసే, ఓటింగ్ హక్కును కల్పించారు. అయినప్పటికీ ఇంకా మహిళలపై అణచివేత కొనసాగుతోంది. ఎన్నో సామాజిక కట్టుబాట్లను తెంచుకుని ఈ హక్కును సాధించుకున్న ఆ దేశ మహిళలపై కొన్ని నిషేధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
- మహిళలు వాహనాలను నడపకూడదు. (మహిళలు డ్రైవింగ్ చేయరాదని నిషేధం విధించిన మొదటి దేశం సౌదీ)
- స్త్రీలు ఒంటరిగా ప్రయాణం చేయకూడదు..ఆ సమయంలో కుటుంబానికి చెందిన పురుషుడు లేదా సంరక్షుడు తప్పనిసరిగా తోడు ఉండాలి
- పెద్దల అనుమతి లేకుండా వివాహం చేసుకోవడానికి స్త్రీలు అనర్హులు
- తల్లీదండ్రి అనుమతి లేనిదే ఎలాంటి ఉద్యోగమూ చేయకూడదు. చేసినా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే ఉద్యోగాలు చేయకూడదు.
- ముస్లిం సాంప్రదాయ బుర్ఖా ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగడానికి వీల్లేదు. శరీరం మొత్తం కవరయ్యేలా దుస్తులు విధిగా ధరించాలి.
- వారసత్వంగా పురుషునితో సమానంగా ఎలాంటి హక్కులు లభించవు.
- పర పురుషులతో మాట్లాడ్డం నిషేధం. బహిరంగ ప్రదేశాలు, రెస్టారెంట్లలో కలిసి తినరాదు, తిరగరాదు
- పురుషుడు తీసుకున్నంత సులభంగా విడాకులు తీసుకోలేరు.
- పురుషులు ఈతకొట్టే ప్రదేశాల్లో ఈత కొట్టకూడదు. క్రీడల్లో పాల్గొనకూడదు.
కాగా సౌదీ అరేబియాలో జరుగుతోన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా అక్కడి మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. అంతే కాదు మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలో కూడా ఉన్నారు. తప్పకుండా విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. మరి ఇంతటి మహత్తర రాజకీయ పరిణామమం తర్వాతైనా ఈ నిషేధాల్లో మార్పు వస్తుందేమో వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement