'మాకు హాని తలపెడితే ఎవ్వరినీ సహించం'
వాషింగ్టన్: అమెరికాకు హాని తలపెడితే ఐఎస్ఎస్, మరి ఏ ఇతర సంస్థ అయినా సహించేది లేదని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ప్రపంచదేశాల్లోని ముస్లిం నేతలు ఐఎస్ఎస్ ఉగ్రవాదంపై నోరు విప్పాలని, వారి వైఖరి ఏమిటన్నది తెలపాలని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఒబామా మరిన్ని విషయాలపై మాట్లాడారు. మతాన్ని ఆధారంగా చేసుకుని ఎవరిపై వివక్ష చూపరాదని తమ అధికారులకు ఆయన సూచించారు. కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో ముస్లిం దంపతులు కాల్పులకు పాల్పడి 14 మందిని హత్యచేసిన విషయం అందరికీ విదితమే. ఈ కాల్పుల ఉదంతాన్ని ఉగ్రవాద చర్యగా ఒబామా అభివర్ణించారు.
ఇరాక్, అఫ్ఘానిస్తాన్ దేశాలపై చేసిన తరహాలోనే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఉగ్ర సంస్థలను హెచ్చరించారు. గత వారం కాల్పులకు పాల్పడిన ఆ ముస్లిం దంపతులు సయ్యద్ రిజ్వాన్ ఫరూక్, పాక్కు చెందిన అతడి భార్య తష్ఫీన్ మాలిక్ ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారన్న దానిపై అమెరికా వద్ద ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని వివరించారు. ఇటువంటి చర్యలు అమెరికా, పశ్చిమ దేశాలపై జరుగుతున్న ఉగ్రచర్యలుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఐఎస్ఎస్ వద్ద పైప్ బాంబులు, భారీ అణ్వాయుధాలు ఉన్నాయని వీటితో అమాయక ప్రజల ప్రాణాలు తీయడమే వారి లక్ష్యమని బరాక్ ఒబామా ఉద్వేగభరితంగా ప్రసంగించారు.