కొత్త నీరు రాగానే పాత నీరు కొట్టుకుపోయినట్లు.. ఇప్పటివరకు ఉన్న చాలెంజ్‌లు సరిపోవని టిక్‌టాక్‌లో మరో కొత్త చాలెంజ్ వచ్చి చేరింది. దీనివల్ల కాలక్షేపం మాట అటుంచితే, ఏరికోరి ప్రమాదాలను తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకీ దీని పేరు ‘సాల్ట్ చాలెంజ్’. ఉప్పు డబ్బా తీసుకుని నోరు నిండా గుమ్మరించుకోవాలి. జొనాథన్ అనే టిక్‌టాక్ యూజర్ ఈ చాలెంజ్‌ను టిక్‌టాక్‌కు పరిచయం చేశాడు. ఇంకేముంది, ముందూవెనకా ఆలోచించకుండానే అందరూ దీన్ని పొలోమని ఫాలో అవుతున్నారు. అయితే ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడం శరీరానికి మంచిది కాదనేది నిపుణుల సలహా. రక్తపోటుతోపాటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలూ లేకపోలేదంటున్నారు. అది విషతుల్యంగా మారి వాంతులు, మూర్ఛ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
గతంలోనూ దాదాపు ఇలాంటి చాలెంజే యూట్యూబ్‌లో వైరల్ అయింది. చెంచా దాల్చిన చెక్క పొడి తీసుకుని దాన్ని నోట్లో వేసుకుని నిమిషం పాటు చప్పరించాలి. మధ్యలో నీళ్లు తాగడానికి కూడా వీల్లేదు. అధిక ఘాటును కలిగి ఉండే దాల్చిన చెక్క నోరును పొడిబారేలా చేస్తుంది. దీన్ని మింగాలని చూస్తే గొంతు మంటతో గిలగిలా కొట్టుకోవాల్సిందే. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉండి నిమిషం పాటు నరకయాతన అనుభవిస్తారు. ఇంత ప్రమాదకరమైనప్పటికీ ‘సినామన్ చాలెంజ్’ పేరుతో ఇది బాగా పాపులర్ అయింది.
ఇదే కాకుండా ఫోన్ ఫ్లాష్‌ను నేరుగా కళ్లలోకి కొట్టుకోవడం కూడా ఈ మధ్య ట్రెండ్ అవుతోంది. దీనివల్ల తాత్కాలికంగా కళ్ల రంగు మారుతుందని టిక్‌టాక్ యూజర్లు భ్రమపడ్డారు. అయితే ఇది సున్నిత అవయవాలైన కళ్లకు అంత మంచిది కాదని, శాశ్వతంగా కళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనిపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఇవేం చాలెంజ్‌లురా బాబూ అని నెత్తి పట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment