అమ్మ చేతి వంట కాదనేవారు సృష్టిలోనే ఎవరూ ఉండరు. కానీ అమ్మను మించిన ప్రేమను పోపేసి మమకారాన్ని మిక్స్ చేసి గారాబంగా గోరుముద్దలు పెట్టాడో చిన్నోడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంది. ఓ బుడతడి చెల్లి ఆకలి అవుతోందంటూ అన్నయ్యకు చెప్పింది. ఇది విన్న పిల్లవాడు తినడానికి ఏదైనా షాపులో నుంచి కొనుక్కొద్దామనుకోలేదు. అలా అని తన తల్లి దగ్గరకో ఇంటి సభ్యుల దగ్గరకో పరిగెత్తలేదు. ఎవరికోసమో ఎందుకు ఎదురుచూడటం అని భావించి తన గారాల చిట్టి చెల్లి ఆకలితో అలమటించడం ఇష్టం లేక నలభీముడి అవతారం ఎత్తాడు.
అమ్మ కొంగు పట్టుకుని ఎన్నిసార్లు వంటగదిలో తిరగలేదు అనుకున్నాడో ఏమో చెల్లి ఆకలి తీర్చడానికి గరిట పట్టుకుని వంట చేయడానికి రెడీ అయ్యాడు. అనుకున్నదే తడవుగా సామాను ముందేసుకున్నాడు. చిన్ని చిన్ని చేతులతోనే ఇండోనేషియన్ ఫ్రైడ్ రైస్ వంటకాన్ని సిద్ధం చేశాడు. ఎంతో కష్టపడి అంతకు మించి ఇష్టపడి చేసిన వంటకాన్ని ఆకలితో దీనంగా చూస్తున్న చెల్లికి గోరుముద్దలు పెట్టి మరీ తినిపించాడు. ఇక ఈ అన్నాచెల్లెలి అనుబంధాన్ని చూసిన ఎవరైనా సంతోషంతో చిరునవ్వులు చిందించకుండా ఉండలేరు.
Comments
Please login to add a commentAdd a comment