పంటి నొప్పితో అంత ప్రమాదమా? | Toothache leads to multi-organ dysfunction | Sakshi
Sakshi News home page

పంటి నొప్పితో అంత ప్రమాదమా?

Published Tue, Jul 19 2016 3:51 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

పంటి నొప్పితో అంత ప్రమాదమా?

పంటి నొప్పితో అంత ప్రమాదమా?

నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని పెద్దలు ఎందుకనేవారో తెలియదు కానీ... నోరు శుభ్రంగా ఉంచుకోపోతే అనారోగ్యాలు మాత్రం తప్పవని ఓ పళ్ళ డాక్టర్ చెప్పిన విషయం ఇప్పుడు 26 ఏళ్ళ మాలా విషయంలో నిజమైంది. పంటినొప్పే కదాని నొప్పి మాత్రలతో సొంతవైద్యం చేసుకొని ప్రాణాలమీదకి తెచ్చుకున్న మాలా... ఆహారం, నీరు సైతం తీసుకోలేని స్థితిలో చివరికి ఐసీయూ లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రిమియర్ బి స్కూల్ ఉద్యోగిగా, జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్న మాలా... ఓ సాధారణ పంటినొప్పి అన్ని అవయవాలకు ప్రమాదం తెస్తుందని (మల్టీ ఆర్గాన్ డిస్ ఫంక్షన్) ఎప్పుడూ ఊహించలేదు. మూడుసార్లు తేలికపాటి కార్డియాక్ అటాక్ లను ఎదుర్కొని, రెండునెల్లపాటు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న ఆమె... ఎట్టకేలకు చివరికి ప్రాణాలతో బయటపడింది. చిన్నపాటి పంటినొప్పితోపాటు కుడి దవడ వాపుతో ప్రారంభమైన మాలా అనారోగ్యం అశ్రద్ధ కారణంగా  ప్రాణాలమీదికి వచ్చింది. నొప్పిమాత్రలతో సమస్య తగ్గకపోగా దవడ వాపు చివరికి గొంతు పూడుకుపోయే పరిస్థితికి చేరింది.  రోజురోజుకూ నీరసపడిపోయి, నొప్పిని కూడా తట్టుకోలేని స్థాయికి చేరడంతో ఆమె తల్లి మాలాను ఆస్పత్రిలో చేర్పించింది.  పంటితో మొదలైన ఇన్ఫెక్షన్ అన్ని అవయవాలకు పాకిపోయిందని,  చివరికి మల్టీ ఆర్గాన్ డిస్ ఫంక్షన్ సిండ్రోమ్ తో ఆమె బాధపడుతున్నట్లు డాక్టర్లు వైద్య పరీక్షలద్వారా తేల్చారు. సిండ్రోమ్ కారణంగా మాలా తీవ్రమైన జ్వరం, లో బీపీ తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిందని ఆమెకు వ్యైద్యం నిర్వహించిన ఆస్పత్రి కంన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్, ఫోర్టిస్ డాక్టర్ సుధా మెనన్ తెలిపారు. మొదట్లో మాలా డెంగ్యూతో బాధపడుతోందనుకున్నామని, న్యుమోనియాకు గురవ్వడం వల్ల వెంటిలేటర్ పై ఉంచాల్సి వచ్చిందని, ఐసీయు సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తమై చికిత్స నిర్వహించడంతో మాలా చివరికి కోలుకోగలిగినట్లు మెనన్ తెలిపారు.

ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా చేరి... గుండె, తల, మెడ భాగాల్లో వ్యాప్తి చెందడంతో మాలా తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు సంక్రమించిన సిండ్రోమ్ వల్ల కనీసం గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది ఎదురైందని,  శస్త్ర చికిత్సతో ట్రాకోస్టమీ ట్యూబ్ ద్వారా ఇన్ఫెక్షన్ ను బయటకు తీసినట్లు వైద్యులు తెలిపారు. బ్యాక్టీరియావల్ల  ఇతర నాళాలు కూడ బ్లాక్ అవ్వడం, ఇన్ఫెక్షన్ బ్లాక్స్ చిన్న చిన్న ముక్కలై ఊపిరితిత్తుల్లోకి ప్రయాణించే పల్మనరీ ఆర్టరీ నాళాలు మూసుకుపోవడంతో మాలా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఊపిరి తీసుకోలేకపోవడం, గుండెనొప్పి, తీవ్ర నిమోనియా సంక్రమించి ఇతర భాగాలకు వ్యాపించడంతో మాలా ఉన్నట్లుండి 20 కేజీల బరువుకూడా తగ్గిపోయింది.

వైద్యుల అప్రమత్తతో ఎట్టకేలకు ప్రాణాపాయం నుంచీ బయటపడిన మాలా... చిన్న చిన్న నొప్పులు, కావిటీలేకదాని అశ్రద్ధ చేయొద్దని, నోటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు, అప్రమత్తంగా ఉండటం కూడ ఎంతో అవసరం అని చెప్తోంది. పంటినొప్పి ప్రమాదాలకు దారితీస్తుందనడానికి తానే పెద్ద ఉదాహరణ అని, గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకోవద్దని సూచిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement