ఒడిశాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), బిజు జనతా దళ్ (బీజేడీ)ల పొత్తు చర్చలు విఫలమయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 147 అసెంబ్లీ, 21 లోక్‌సభ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించే అవకాశాలున్నాయని బీజేపీ ఒడిశా విభాగం తెలిపింది. ఒడిశాలో ఎన్నికల పొత్తుకు సంబంధించి అధికార బీజేడీతో జరిగిన చర్చలు అసంపూర్తిగా మిగిలాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్ మీడియాకు తెలిపారు.
బీజేపీ సీనియర్ నేతలతో పాటు ఢిల్లీకి వెళ్లిన సామల్ రాజధాని భువనేశ్వర్‌కు తిరిగి వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర నేతలతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లాం. ఈ సమావేశంలో ఏ పార్టీతోనూ పొత్తు లేదా సీట్ల పంపకంపై చర్చ జరగలేదు. రాబోయే ఈ రెండు ఎన్నికల్లోనూ ఒడిశాలో బీజేపీ విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. ఈ రెండు ఎన్నికల్లోనూ బీజేపీ సొంతంగా పోటీ చేస్తుందని’ అన్నారు.
బీజేడీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సన్నిహితుడు వీ.కే పాండియన్, ప్రణబ్ ప్రకాష్ దాస్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. బీజేపీ నాయకత్వంతో మాట్లాడేందుకు వారు దేశ రాజధానికి వెళ్లారు. బీజేడీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పాండియన్, దాస్ హాజరయ్యారు. అయితే ఒడిశాలోని అధికార బీజేడీ, ప్రతిపక్ష బీజేపీల మధ్య సీట్ల పంపకంపై అవగాహన కుదరక చర్చలు నిలిచిపోయాయని సమాచారం.
పొత్తుపై ఇరు పార్టీలు పరస్పరం అంగీకరించినా సీట్ల పంపకం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమమవుతున్నాయని తెలుస్తోంది. 147 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీలో 100కు పైగా సీట్లలో పోటీ చేసేందుకు బీజేడీ డిమాండ్ చేసింది. ఇది బీజేపీకి ఆమోదయోగ్యం కాలేదు. బీజేడీకి అసెంబ్లీలో 114 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీతో చర్చల సమయంలో తొలుత బీజేడీ 112 సీట్లు డిమాండ్ చేసింది. ‘బీజేడీ దాదాపు 75 శాతం అసెంబ్లీ సీట్లను డిమాండ్ చేస్తోంది. ఇది తమకు ఆమోదయోగ్యం కాదు’ అని బీజేపీ సీనియర్ నేత ఒకరు మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment