ట్రంప్ అమలు చేయాల్సిన ఐదు హామీలివి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఆయనిచ్చిన అయిదు ప్రధాన హామీలను సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని ఆయనకు ఓటేసిన ఓటర్లు కోరుతున్నారు. అమెరికాకు భారీగా పెరుగుతున్న వలసలగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటానని ఆది నుంచి చెబుతున్న ట్రంప్ మెక్సికో సరిహద్దులో పటిష్టమైన అడ్డుగోడను నిర్మిస్తానని ప్రచారం చేశారు.
మెక్సికో గోడ నిర్మించాలి
2015, జూన్ నెలలో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టగానే మెక్సికో నుంచి సరిహద్దులు దాటి రేపిస్టులు, నేరస్థులు అమెరికాలోకి ప్రవేశిస్తున్నారని, అలాంటి వారిని అడ్డుకోవడానికి సరిహద్దు వెంట పటిష్టమైన గోడను నిర్మిస్తానని, దానికయ్యే ఖర్చులో సగ భాగాన్ని ఆ దేశం నుంచే రాబడతానని కూడా చెప్పారు. ఇప్పుడు ఆ గోడను నిజంగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. గోడను నిర్మించేందుకు ట్రంప్ మద్దతుదారుల్లో 73 శాతం మంది ఓ సర్వేలో ఓటేశారు.
హిల్లరీని లాకప్‌లో పెట్టాలి
దేశాధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన హిల్లరీ క్లింటన్‌ను ఈమెయిళ్ల కుంభకోణం కేసులో జైల్లో పెట్టాలని ట్రంప్ మద్దతుదారులు కోరుకుంటున్నారు. ఆయనకు మద్దతుగా నిర్వహించిన ప్రతీ ప్రచార ర్యాలీలోనూ ఈ డిమాండ్లు మారుమ్రోగాయి. ఎన్నికల ప్రచార ఘట్టంలో భాగంగా హిల్లరీతో జరిగిన డిబేట్‌లో ట్రంప్ మాట్లాడుతూ ‘నేను విజయం సాధిస్తే ఈ మెయిళ్ల వ్యవహారంలో హిల్లరీని విచారించేందుకు మంచి ప్రాసిక్యూటర్‌ను తీసుకురావాలని అటార్ని జనరల్‌ను ఆదేశిస్తా!’ అని అన్నారు. అందుకు ట్రంప్ టెంపర్‌మెంట్ కలిగిన వ్యక్తి చేతుల్లో చట్టం లేదని హిల్లరీ బదులిచ్చారు. అలాంటి వ్యక్తి ఉంటే నిజంగా హిల్లరీ జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది ట్రంప్ ప్రతి కామెంట్ చేశారు.
ముస్లింలపై నిషేధం
ఏడాది క్రితం కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో జరిగిన ఊచకోత సంఘటనపై ట్రంప్ స్పందిస్తూ ‘దేశంలో అసలేం జరుగుతుందో తేలేవరకు దేశంలోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలి’ అని పిలుపునిచ్చారు. మరో సందర్భంలో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల నుంచి ప్రజలను అమెరికాలో అనుమతించమని చెప్పారు. ఇప్పుడు ఈ మాటను నిలబెట్టుకోవాలని ఆయన మద్దతుదారులు కోరుతున్నారు.
ఒబామా కేర్‌ను రద్దు చేయండి
ఒబామా కేర్‌గా ముద్రపడిన జాతీయ హెల్త్‌కేర్ పథకాన్ని రద్దు చేయాలని రిపబ్లికన్లు కోరుతున్నారు. ఈ పథకంపై 2010లో ఒబామా సంతకం చేసిన నాటి నుంచి దాన్ని రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని రద్దుచేసి దాని స్థానంలో ఇంతకన్నా మంచి ఆరోగ్య పథకాన్ని తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఆ దిశగా ట్రంప్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
నాఫ్తా, టీపీపీల రద్దు
ట్రంప్ తన ఎన్నికల ప్రచారం సందర్భంగా నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (నాఫ్తా), ట్రాన్స్ పసిపిక్ అగ్రిమెంట్ (టీపీపీ)ను రద్దు చేయాలని అన్నారు. తాను అధికారంలోకి వస్తే తప్పకుండా వీటిని రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీల కారణంగానే ఆయన విస్కాన్సిన్, పెన్సిల్వేనియా లాంటి డెమోక్రట్ల ప్రాబల్య రాష్ట్రాల్లో విజయం సాధించారు. చివరకు టీపీపీ రద్దుకు హిల్లరీ అంగీకరించినా, ఆమె వైఖరి మార్పునకు ట్రంపే కారణమని ఓటర్లు భావించారు. తన భర్త బిల్ క్లింటన్ అధికారంలో ఉన్నప్పుడు సంతకం చేసిన నాఫ్తా రద్దుకు ఆమె సాహసించలేకపోయారు. ఇప్పుడు ఈ అయిదు డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ట్రంప్ మీద ఉందని ఓటర్లు భావిస్తున్నారు.