పెషావర్ ఆర్మీ పాఠశాలలో మంగళవారం తాలిబాన్ ఘాతుకం పాకిస్తాన్‌ను విషాదంలో ముంచెత్తింది. పాక్ ప్రభుత్వం మూడు రోజులు సంతాపదినాలు ప్రకటించిన నేపథ్యంలో..
ఇస్లామాబాద్: పెషావర్ ఆర్మీ పాఠశాలలో మంగళవారం తాలిబాన్ ఘాతుకం పాకిస్తాన్‌ను విషాదంలో ముంచెత్తింది. పాక్ ప్రభుత్వం మూడు రోజులు సంతాపదినాలు ప్రకటించిన నేపథ్యంలో.. మృతులకు దేశంలోని అన్ని పాఠశాలల్లో బుధవారం ఉదయం ప్రార్థనల సమయంలో శ్రద్ధాంజలి ఘటించారు. ఇస్లామాబాద్, రావల్పిండి సహా పలు నగరాల్లో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. మృతదేహాల ఖననం జరిగే ప్రదేశాల వద్దకు బంధుత్వాలకతీతంగా ప్రజలు హాజరయ్యారు. తాలిబాన్ మద్దతుదారులు, సైద్ధాంతిక మిత్రులూ తీవ్రంగా విమర్శించారు.
విష బీజాల ఫలితమిది.. వరుస ప్రభుత్వాలు దశాబ్దాలుగా నాటిన విష బీజాల ఫలితాన్నే దేశం ప్రస్తుతం ఉగ్ర దాడుల రూపంలో అనుభవిస్తోందని పాక్ పత్రికలు దుయ్యబట్టాయి. జీహాదీ సంస్థలపై సైన్యం చర్యలు తీసుకోనంతకాలం హింసను ఆపడం సాధ్యం కాదన్నాయి. కాగా, దాడిని అమెరికా చట్టసభల సభ్యులు ఖండించారు. ఉగ్రవాదుల ఏరివేతను పాక్ కొనసాగించాలని, ఆ దేశానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.