the Taliban
-
పాకిస్తాన్ స్వయంకృతమే
ఘోరం. క్రూరం. దారుణం. ఈ మాటలేవీ పాకిస్తాన్లో చిన్నారి పిల్లలపై జరిగిన మారణకాండను వర్ణించడానికి సరిపోవు. పెషావర్ నగ రంలోని సైనిక పాఠశాల పిల్లలపై తాలిబాన్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 145 మంది పిల్లలను, ఉపాధ్యాయులను, సిబ్బందిని పొట్టనబెట్టుకోవడం విషాదకరం. ఉగ్రవాదులు మానవ మృగాలుగా మారి అభంశుభం తెలియని పిల్లలను హత మార్చడం క్షంతవ్యం కాని నేరం. తాలిబాన్లు ఎంతటి దురాగతానికైనా పాల్పడతారనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. పసిపిల్లలపైకి తూటాలు ఎక్కుపెట్టడం దిగ్భ్రాం తికరం. చరిత్రలోనే ఇదొక చీకటి అధ్యాయం. తమపై దాడి చేస్తున్న పాకిస్తాన్ సైన్యాన్ని ఎదిరించి నిలువలేని ముష్కర మూకలు ఆ సైని కుల పిల్లలు చదివే పాఠశాలపై దాడిచేయడం పిరికిపందల క్రూర చర్య తప్పితే మరేమీ కాదు. అయితే ఆదినుంచీ ఉగ్రవాదులకు పాలు పోసి పెంచి పోషించిన పాకిస్తాన్కు తాజా రాక్షసకాండ కేవలం స్వయం కృతమే. ఎప్పటినుంచో భారతదేశంపై కత్తులు దూస్తున్న లష్కరే తోయిబా వంటి ముష్కర మూకలకు పాకిస్థాన్ అండగా నిలుస్తోంది. ఇప్పటికైనా పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకోవాలి. ప్రపంచ దేశాలతో కలసి తీవ్రవాదంపై పోరుకు సిద్ధమవ్వాలి. బట్టా రామకృష్ణ దేవాంగ సౌత్ మోపూరు, నెల్లూరు జిల్లా -
విషాదంలో పాకిస్తాన్
ఇస్లామాబాద్: పెషావర్ ఆర్మీ పాఠశాలలో మంగళవారం తాలిబాన్ ఘాతుకం పాకిస్తాన్ను విషాదంలో ముంచెత్తింది. పాక్ ప్రభుత్వం మూడు రోజులు సంతాపదినాలు ప్రకటించిన నేపథ్యంలో.. మృతులకు దేశంలోని అన్ని పాఠశాలల్లో బుధవారం ఉదయం ప్రార్థనల సమయంలో శ్రద్ధాంజలి ఘటించారు. ఇస్లామాబాద్, రావల్పిండి సహా పలు నగరాల్లో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. మృతదేహాల ఖననం జరిగే ప్రదేశాల వద్దకు బంధుత్వాలకతీతంగా ప్రజలు హాజరయ్యారు. తాలిబాన్ మద్దతుదారులు, సైద్ధాంతిక మిత్రులూ తీవ్రంగా విమర్శించారు. విష బీజాల ఫలితమిది.. వరుస ప్రభుత్వాలు దశాబ్దాలుగా నాటిన విష బీజాల ఫలితాన్నే దేశం ప్రస్తుతం ఉగ్ర దాడుల రూపంలో అనుభవిస్తోందని పాక్ పత్రికలు దుయ్యబట్టాయి. జీహాదీ సంస్థలపై సైన్యం చర్యలు తీసుకోనంతకాలం హింసను ఆపడం సాధ్యం కాదన్నాయి. కాగా, దాడిని అమెరికా చట్టసభల సభ్యులు ఖండించారు. ఉగ్రవాదుల ఏరివేతను పాక్ కొనసాగించాలని, ఆ దేశానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.