ఉగ్రముప్పు.. పారాహుషార్!
కేంద్ర నిఘా సంస్థల హెచ్చరిక
జనవరి 26న ఒబామా భారత్రాక
అప్రమత్తమైన నగర పోలీసులు
పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని
స్కూళ్లకు నోటీసులు జారీ
సిటీబ్యూరో: పాకిస్తాన్‌లోని పెషావర్ ఆర్మీ పాఠశాలలో తాలిబన్ ఉగ్రవాదులు సాగించిన నరమేధం.. ఆస్ట్రేలియాలో సిడ్నీకేఫ్‌పై ఉగ్రవాదుల దాడి... భారత్‌పై దాడులు చేస్తామని లష్కర్-ఏ-తోయిబా ఉగ్ర నేత మసూద్ ప్రకటన.. జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా భారత్ వస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదుల ముప్పు ఉందని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి అన్ని పాఠశాలలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. స్కూళ్ల ప్రిన్సిపాల్స్, టీచర్లకు అవగాహన కల్పించేం దుకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. శుక్రవారం సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి అబిడ్స్ డివిజన్లోని ఈడెన్ గార్డెన్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు బాంబు దాడులు, కాల్పులకు పాల్పడిన సమయంలో విద్యార్థులను ఎలా రక్షించాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.
ఇదే రకంగా సైఫాబాద్, చిక్కడపల్లిలో సైతం ఈ విధమైన మాక్‌డ్రిల్‌ను పోలీసులు నిర్వహించారు. స్కూళ్ల భద్రతపై నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్కూల్ యాజమాన్యాలకు సూచించారు. మరోపక్క కార్డన్ సర్చ్ పేరుతో ఆసీఫ్‌నగర్, అఫ్జల్‌గంజ్ తదితర ప్రాంతాల్లోని బస్తీలను చుట్టుముట్టి ప్రతి ఇంటిని మూడు రోజుల నుంచి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మరోపక్క టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగరంలోని లాడ్జీలు, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లలో తనిఖీలు చేపట్టారు. నగరానికి వచ్చే కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలని ఠాణా ఇన్చార్జిలకు ఆదేశాలు జారీ చేశారు. భిక్షాటన చేస్తూ ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారి వేలి ముద్రలను సైతం సేకరిస్తున్నారు. ఈ రూపంలో కూడా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ దిశగా కూడా పోలీసులు ఓ కన్నేసి ఉంచారు.
నగరంలో ఉగ్రమూలాలు..
హైదారాబాద్‌లో ఆర్మీ పాఠశాలలు ఉండడం, పాఠశాలకు వచ్చిపోయే రహదారులపై కూడా భద్రత చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ బాంబు పేలుడు ఘటనలో నిందితుడు ఖలీద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. దర్యాప్తులో అతను పాక్‌లోని తాలిబన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తేలింది. అంతేకాకండా నగరంలో ఇటీవల ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్)లో చేరేందుకు ఇంజినీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం ఆకర్షితులైన విషయం కూడా ఇటీవలే వెలుగు చూసింది. ఈ రెండు ఉదంతాలు ప్రమాదకర పరిణామమేనని భావించిన నిఘా సంస్థలు నగరంపై ప్రత్యేక దృష్టి సారించాయి.
జాగ్రత్తలు తీసుకోండిలా...
► 300 మంది పిల్లలు ఉన్న స్కూళ్లు ప్రజా భద్రత చట్టం కిందికి వస్తాయి
► ఈ స్కూళ్లలో నాణ్యమైన సీసీ కెమెరాలు లోపల, బయట ఏర్పాటు చేసుకోవాలి
►స్కూల్ గేటు నుంచి 50 మీటర్ల దూరం వరకు కవర్ చేసే విధంగా సీసీ కెమెరాలు పెట్టాలి
►{పయివేటు సెక్యూరిటీ గార్డులను నియమించాలి
►డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలి
► విద్యార్థులకు భద్రతపై అవగాహన కల్పించాలి
►ఇందుకోసం పది రోజుల గడువు