డల్లాస్‌లోని 'గాంధీ స్మారకస్థలి'కి ఘననివాళులు | Tribute to Mahatma Gandhi Memorial of North Texas grandly in Dallas | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లోని 'గాంధీ స్మారకస్థలి'కి ఘననివాళులు

Published Tue, Jul 5 2016 11:05 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

డల్లాస్‌లోని 'గాంధీ స్మారకస్థలి'కి ఘననివాళులు - Sakshi

డల్లాస్‌లోని 'గాంధీ స్మారకస్థలి'కి ఘననివాళులు

డల్లాస్‌: స్వతంత్ర భారత ప్రాభవదీప్తికి అహింసాయుధంతో మార్గం సుగమం చేసిన జాతిపిత మహాత్ముని బోధనలు, ఆదర్శాలే నేటి ప్రపంచానికి శరణ్యమని పద్మభూషణ్ పురస్కార గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. సోమవారం నాడు అమెరికా దేశపు 240వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, డల్లాస్‌లోని మహాత్మా గాంధీ స్మారకస్ధలిని ఆయన సతీసమేతంగా సందర్శించి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ ప్రసంగిస్తూ బరాక్ ఒబామా అధ్యక్షుడి హోదాలో భారత్ పర్యటించినప్పుడు పార్లమెంట్ ఇరుసభలనుద్దేశించి ప్రసంగిస్తూ తాను ఆ స్థాయికి చేరుకోవటానికి గాంధీజీ బోధనలే ఆదర్శంగా తీసుకున్నానని తెలిపారని వెల్లడించారు.

ఐసిస్ ఉగ్రమూకల చర్యలతో అట్టుడుకుతోన్న నేటి ప్రపంచపటానికి నాడు గాంధీజీ ప్రవచించిన సిద్ధాంతాలే సరైన ఔషధమని, అవే ప్రపంచశాంతికి వెన్నుముక అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేడు పెద్ద ఎత్తున ఉద్యమంలా సాగిస్తున్న స్వచ్ఛభారత్ కార్యక్రమం గాంధీజీ ఆచరించి చూపిందేనని, దాన్ని విజయవంతం చేయటానికి భారతీయులు అహరహం శ్రమించాలని కోరారు. అనంతరం యార్లగడ్డ రచించిన "దక్షిణాఫ్రికాలో మహాత్మోదయం" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

అమెరికా లోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ స్మారక స్థలి నిర్మాణం గావించి, భావి తరాలకు స్ఫూర్తి దాయకంగా నిల్పడంలో అతి చురకైన నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ స్మారకస్థలి కార్యవర్గ అధ్యక్షుడు డాక్టర్. తోటకూర ప్రసాద్ ను అయన కార్యవర్గాన్ని డాక్టర్. యార్లగడ్డ ప్రత్యేకంగా అభినందించారు. మహాత్మా గాంధీ స్మారకస్థలి కార్యవర్గ అధ్యక్షుడు డాక్టర్. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ 2014లో స్మారకస్థలి ఆవిష్కరణలో పాల్గొన్న యార్లగడ్డ నేడు తిరిగి ఇదే వేదిక వద్ద మహాత్ముని జీవిత అనుభవాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అన్నారు.

అమెరికాలో అతిపెద్ద గాంధీ విగ్రహంగా ఖ్యాతికెక్కిన డల్లాస్‌లోని గాంధీ స్మారకస్థలి వద్ద అమెరికా స్వతంత్ర దినోత్సవం నాడు సమీకృతమవ్వడం గౌరవంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. అనంతరం అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను డాక్టర్. తోటకూర ప్రొఫెసర్. యార్లగడ్డకు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్. తోటకూర ప్రసాద్ అమెరికా దేశ ప్రజలకు స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలియజేశారు.

మహాత్మా గాంధీ స్మారకస్థలి కార్యదర్శి రావు కల్వల మాట్లాడుతూ అన్ని రంగాలలోను ఎంతో అనుభవం ఉన్న ప్రొఫెసర్. యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను భారత ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ బిరుదు తో సత్కరించడం సముచితంగా ఉన్నదని, ఈ రోజు సతీ సమేతం గా వచ్చి మహాత్మా గాంధి కి నివాళులు అర్పించినండులకు కృతజ్ఞతలను తెలియజేశారు. స్మారకస్థలి కార్యవర్గ సభ్యులు షబ్నం మోద్గిల్, టాంటెక్స్ అధ్యక్షుడు సుభ్రమణ్యం జొన్నలగడ్డ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి డాక్టర్. యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, శ్రీమతి. యార్లగడ్డ, డాక్టర్. ప్రసాద్ తోటకూర, రావు కల్వల, షబ్నం మోడ్గిల్, కృష్ణా ఎన్నారై అధ్యక్షుడు డాక్టర్. పొన్నూరు సుబ్బారావు, తాతినేని రాం, డాక్టర్. సీ.ఆర్.రావు, ఎం. వి. ఎల్. ప్రసాద్, డాక్టర్. శ్రీనివాసరెడ్డి, వెంకట అనిల్ పొత్తూరు, డాక్టర్. ఉమామహేశ్వర రెడ్డి, శ్రీధర్ తుమ్మల, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement