thotakura prasad
-
తానా ఆధ్వర్యంలో ‘తారలు-రాతలు’
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తొమ్మిదవ అంతర్జాతీయ ఆన్లైన్ సాహిత్య సమావేశం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర నిర్వహణలో విశిష్ట అతిధులు విచ్చేసి ‘‘తారలు-రాతలు’’ అనే అంశంపై సినీ తారలుగా వెలుగొందుతూ మంచి సాహిత్యాన్నిసృష్టించిన సినిమా తారలు తనికెళ్ళ భరణి, డా. అక్కినేని నాగేశ్వర రావు, డా.పీ భానుమతి, డా. కొంగర జగయ్య, డా. గొల్లపూడి మారుతిరావుల రచనలను గుర్తు చేసుకున్నారు. తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి తన ప్రారంభోపన్యాసంలో ఇది ఒక వినూత్న, విశిష్ట కార్యక్రమమని, సినిమా నటులుగా అందరికి పరిచయమైన వారి రచనలను సాహిత్య సమాలోచన జరపడం సముచితంగా ఉందన్నారు. వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్.. అగ్రశ్రేణి తారలైన వారిలో కొంతమంది నటులుగా రాణిస్తూనే తమ రచనా వ్యాసాంగాన్ని కొనసాగించడం, ఇప్పుడు దాన్ని చర్చించడం హర్షనీయమన్నారు. ప్రముఖ నాటక రచయిత, కథారచయిత, సంభాషణల రచయిత, సినీ నటుడు, దర్శకుడైన తనికెళ్ళ భరణి.. తాను విద్యార్ధి దశలో రాసిన “అద్దె కొంప, ఆ తర్వాతి కాలంలో రాసిన “గోగ్రహణం, “కోక్కరోకో, “గార్ధ భాండం, “చలచల్ గుర్రం, “జంబు ద్వీపం, “గొయ్య్ఙి మొదలైన నాటికలు రాసిన నేపథ్యాన్ని, ‘నక్షత్ర దర్శనం’, ‘పరికిణి’, ‘ఎందరో మహానుభావులు’ మొదలైన రచనలు ‘శభాష్ రా శంకరా’, ‘ఆటగదరా శివ’ లాంటి రచనల్లోంచి కొన్ని పద్యాలు పాడి అందరినీ పరవశింప చేశారు. పద్మవిభూషణ్, నట సామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వర రావు రాసిన ‘అక్కినేని ఆలోచనలు’, ‘మనసులో మాట’ మొదలైన రచనల గురించి దాశరథి. సినారె లాంటి సాహితివేత్తలతో ఆయనకున్న సాహిత్యానుబంధం గురించి ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలను, అయన సాహితీ ప్రస్థానాన్ని, అక్కినేని ఆత్మీయ సోదరిగా అభిమానం సంపాదించుకున్న డా. కేవీ కృష్ణ కుమారి సోదాహరణంగా వివరించారు. డా. పీ భానుమతి రాసిన ‘అత్తగారి కథలు’, ‘భానుమతి కథలు’, ‘నాలో నేను’ అనే తన ఆత్మ కథలోని విశేషాలు, చక్రపాణి గారితో ఆమెకున్న సాహిత్యానుబంధం, సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం లాంటి ఎన్నో విశేషాలను డా. భానుమతితో పాతికేళ్ళ అనుబంధం ఉన్న ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి శారదా అశోకవర్ధన్ ఎన్నో విశేషాలను ఆసక్తికరంగా పంచుకున్నారు. కళావాచస్పతి డా. కొంగర జగ్గయ్య విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కొన్ని రచనలను ‘రవీంద్రగీత’గా రాసిన తీరు, ‘మనస్విని’ అనే సాహితీ సంస్థ ద్వారా అచార్య ఆత్రేయ రచించిన సినీ గీతాలను ఏడు సంపుటాలుగా ప్రచురించడం, ఎన్నో సాహిత్య సమావేశాలను నిర్వహించడం, డా. జగయ్యతో తనకున్న ఎన్నో ఏళ్ల సాహిత్యనుబంధాన్ని ప్రఖ్యాత కవి, రచయిత రసరాజు ఎంతో ఆత్మీయంగా, రసరమ్యంగా పంచుకున్నారు. డా. గొల్లపూడి మారుతీ రావు ఎంతో విస్తారంగా సృష్టించిన నాటికలు, నాటకాలు, నవలలు, కథా సంపుటాల పై ప్రముఖ కవి, కౌముది అంతర్జాల మాస పత్రిక వ్యవస్థాపకులు కిరణ్ ప్రభ డా. గొల్లపూడి రచనలపై ఎంతో లోతైన సమగ్ర సాహిత్య విశ్లేషణ చేశారు. ముఖ్యంగా డా. గొల్లపూడి రాసిన “సాయంకాలం అయింద్ఙి నవల, ఆత్మకధ “అమ్మ కడుపు చల్లగ్ఙా, “జీవన కాలమ్స్, ఆయన విశిష్ట రచనా శైలి, కౌముది మాస పత్రికతో డా. గొల్లపూడి కున్న సుదీర్ఘ సాహిత్యనుబంధాన్ని చక్కగా వివరించారు. డా. అక్కినేని నాగేశ్వర రావు, తనికెళ్ళ భరణి, డా. గొల్లపూడితో తనకున్న ప్రత్యేక ఆత్మీయ అనుభందం, ఎన్నోసార్లు కలిసి గడిపిన మధుర సంఘటనలను డా. ప్రసాద్ తోటకూర గుర్తు చేసుకుని అది ఒక అరుదైన సువర్ణ అవకాశం అని అభిప్రాయ పడ్డారు. -
డల్లాస్‌లో ఘనంగా 72వ రిపబ్లిక్ వేడుకలు
డల్లాస్: టెక్సస్ - డల్లాస్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ దగ్గర భారత దేశ 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర భారతదేశ జెండా ను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. కోవిడ్ కారణంగా అతి సాధారణంగా జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి రావు కల్వల, కో ఛైర్మన్ శైలేష్ షా లు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన బి. ఆర్. అంబేద్కర్, ఇతర సభ్యులకు, మహాత్మాగాంధీతో పాటు పలువురు జాతీయ నాయకులకు ఘన నివాళులర్పించారు. -
గీతం మూర్తికి డల్లాస్‌లో ఘననివాళి
డల్లాస్ (టెక్సాస్) : ‘గీతం విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం’ (గానం) ఆధ్వర్యంలో డల్లాస్‌లో జరిగిన సంతాప సభలో ఇటీవల అమెరికాలో మరణించిన గీతం విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు డాక్టర్ ఎం.వి.వి.ఎస్ మూర్తి, గీతం పాలక మండలి సభ్యులు వెలువోలు బసవపున్నయ్య, గీతం హైదరాబాద్ క్యాంపస్‌లో అధికారిగా పని చేస్తున్న వి. పి. ఆర్ చౌదరి (చిన్నా), గీతం విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు వీరమాచినేని శివ ప్రసాద్‌లకు ప్రవాసాంధ్రులు ఘన నివాళులర్పించారు. గీతం విశ్వవిద్యాలయంలో చదువుకొని ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అర్లింగ్టన్లో పని చేస్తున్న ప్రొఫెసర్ ఆనంద్ పుప్పాల తన విద్యార్థి జీవితాన్ని నెమరవేసుకుంటూ గీతం తన భవిష్యత్తుకి చక్కని మార్గాన్ని చూపిందని, తాను ఇప్పుడు అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దే అవకాశం కల్పించిందని, ప్రత్యేకంగా తనకు ఎం.వి.వి.ఎస్ మూర్తితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గీతం విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్ధులు ప్రసాద్ రెడ్డి గుజ్జు, చినసత్యం వీర్నపు మాట్లాడుతూ గీతం వల్లే ఈ రోజు తమలాంటి వేలాది మంది ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడ్డారని, చదువు చెప్పిన గీతం విశ్వవిద్యాలయానికి, దాన్ని స్థాపించిన డాక్టర్. ఎం.వి.వి.ఎస్ మూర్తికి జీవితాంతం ఋణపడి ఉంటామని పేర్కొన్నారు. 25 సంవత్సరాలకు పైగా తాను చేస్తున్న నిస్వార్ధ సేవకు గుర్తింపుగా గీతం విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న తొలి ప్రవాస భారతీయుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఎం.వి.వి.ఎస్ మూర్తి పారిశ్రామిక వేత్తగా, రాజకీయ నాయకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహిoచినప్పటికీ విద్యావేత్త గానే ఆయన ఎక్కువగా గుర్తింపు పొందడం, విద్య పై ఆయనకున్న మమకారాన్ని తెలియజేస్తుందన్నారు. అకుంఠిత దీక్ష, కఠోర శ్రమతో గీతం విశ్వవిద్యాలయాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యావ్యవస్థగా మూర్తి తీర్చిదిద్దిన తీరు ఆదర్శప్రాయమన్నారు. ప్రతి సంవత్సరం ఇరవై రెండు వేల మంది విద్యార్థులు విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో విద్యాభ్యాసం చేయడం గొప్ప విషయం అన్నారు. అంతే గాక ప్రతి సంవత్సరం అనేక వందల మంది విద్యార్థులు గీతం విశ్వవిద్యాలయం నుండి దేశ, విదేశాలల్లో కార్పొరేట్ రంగంలో అత్యధిక వేతనాలతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. ఒక గొప్ప మానవతావాదిని, దార్శనికుడిని కోల్పోవడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తీరని లోటు అని తోటకూర ప్రసాద్ తెలిపారు. అలస్కా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కడియాల వెంకటరత్నం (గాంధీ) త్వరలో కోలుకోవాలని ఆశించారు. ఇంకా ఈ సంతాప సభలో డాక్టర్. ఉరిమిండి నరసింహా రెడ్డి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శేషారావు బొడ్డు, విజయమోహన్ కాకర్ల మొదలైన వారు తమ ప్రసంగాల్లో మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
పెద్ది సాంబశివరావుకు డల్లాస్‌లో ఘన సన్మానం
డల్లాస్ : తెలుగు భాష పరిరక్షణకు చేస్తున్న సేవలకుగానూ గుంటూరుకి చెందిన బహు భాషా నిఘంటువుల నిర్మాత పెద్ది సాంబశివరావుని ‘ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్’ డల్లాస్‌లో ఘనంగా సత్కరించింది. వైద్య ఆరోగ్య శాఖలో పదవీ విరమణ చేసిన తర్వాత 75 ఏళ్ల వయస్సులో వీరు 50 నిఘంటువులను కూర్చి రికార్డు నెలకొల్పారు. వీటిలో కొన్నిటిని ఇంటర్నెట్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవటానికి వీలుగా ఉంచారు. మరి కొన్నిటిని ప్రముఖ సంస్థలు ప్రచురించాయి. ఆయన తన కృషిని ఇంతటితో ఆపకుండా అరచేతిలో అర్థాలమూట అన్నట్లుగా 16,000 తెలుగు మాటలకు ఇంగ్లీష్, హిందీ అర్థాలు ఇచ్చే ఆండ్రాయిడ్ యాప్‌ను తయారు చేశారు. వి. ఫణి కిరణ్ సాంకేతిక సహకారంతో రూపొందిన ఈ యాప్ ను గురించి ‘ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్’ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర వివరించారు. యాప్‌ను ఆవిష్కరించిన డాక్టర్. రాఘవేంద్ర ప్రసాద్, సాంబశివరావు కృషిని ఆయన వ్యక్తిత్వ విశిష్టతను ప్రశంసించారు. దేశ సమైక్యతకు భాషల పదకోశాలు అవసరమన్నారు. 7 సంవత్సరాల తన నిఘంటువు నిర్మాణ కృషిని, తాను చేసిన అన్నమాచార్య సాహిత్యం గురించి సాంబశివరావు వివరించి శ్రోతల సందేహాలకు సమాధానాలు చెప్పారు. ‘ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం’ ఉత్తరాధ్యక్షుడు చిన సత్యం వీర్నపు“తెలుగు – సంస్కృతం” నిఘంటువును ఆవిష్కరించగా, డాక్టర్. భానుమతి ఇవటూరి “సంస్కృతం - తెలుగు” నిఘంటువును ఆవిష్కరించారు. సభ చివరిలో యాప్ నిర్మాత పెద్ది సాంబశివరావుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చెన్నుపాటి కృష్ణ మోహన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
డల్లాస్‌లో గాంధీ మెమోరియల్‌ను సందర్శించిన లక్ష్మణ్
డల్లాస్, టెక్సాస్ : తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, ముషీరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ డల్లాస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ను సందర్శించి జాతిపితకు ఘన నివాళులర్పించారు. డల్లాస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ను సందర్శించడం తన అమెరికా పర్యటనలో ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోతుందని అన్నారు. భారత దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వాల కోసం తన జీవితాన్ని అంకితం చేసి విశ్వ మానవుడిగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని డల్లాస్‌లో నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దీని సాధనలో కృషి చేసిన గాంధీ మెమోరియల్ సంస్థ ఛైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర, కార్యవర్గ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ప్రవాస భారతీయులను లక్ష్మణ్ అభినందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి ఏటా జూన్ 21వ తేదీన ఈ మెమోరియల్ దగ్గర అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సముచితంగా ఉందని లక్ష్మణ్ అన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ సంస్థ ఛైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర, డాక్టర్. లక్ష్మణ్‌కు స్వాగతం పలుకుతూ ఇదే ప్రాంగణంలో ఆగష్టు 15 వ తేదీన భారతదేశపు 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వందలాది ప్రవాస భారతీయుల మధ్య జరుపుకోవడానికి తగు సన్నాహాలు చేస్తున్నామని తెలియజేశారు. తీరికలేని కార్యక్రమాల ఒత్తిడి ఉన్నా వీలు చేసుకొని గాంధీ మెమోరియల్‌ను సందర్శించినందుకు లక్ష్మణ్‌కు తమ సంస్థ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూతురు శ్రీనివాస్ రెడ్డి, అజయ్ కల్వల, సతీష్, భీమ పెంట, రవి పటేల్‌లు పాల్గొన్నారు. -
కళాతపస్వికి అక్కినేని జీవిత సాఫల్యపురస్కారం
డాలస్‌లో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా బోర్డు సమావేశం డాలస్, టెక్సాస్: పద్మవిభూషణ్ డాక్టర్.అక్కినేని నాగేశ్వర రావు 94వ జయంతి సందర్భంగా డాలస్‌లో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా బోర్డు సమావేశం అయ్యింది. అమెరికాలో “అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” ను 2014 లో స్థాపించామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. తోటకూర ప్రసాద్ తెలిపారు. నాగేశ్వరరావు 'కృషి, పట్టుదల, ఆత్మస్తైర్యం, దూరదృష్టి' అనే విశిష్ట లక్షణాలు ముఖ్యంగా యువతరానికి స్ఫూర్తిదాయకం కావాలనే ఉద్దేశ్యంతో భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్కినేని అంతర్జాతీయ పురస్కారాన్ని జరుపుతున్నామన్నారు. 2014లో గుడివాడ, 2015 లో హైదరాబాద్, 2016లో చెన్నైలో జరిపామని తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్ 16 న ఏలూరులో ఈ పురస్కార ప్రదానోత్సవం జరుపుతున్నామని, ఈ సందర్భoగా వివిధ రంగాలలో నిష్ణాతులైన వారికి పురస్కారాలను అందజేస్తున్నామని తోటకూర ప్రసాద్ పేర్కొన్నారు. అనేక ఉత్తమ చిత్రాలు నిర్మించి తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి కె. విశ్వనాథ్‌కి “జీవిత సాఫల్య పురస్కారం” అందజేయనున్నట్టు వెల్లడించారు. అత్యున్నత ప్రమాణాలతో విద్యా సంస్థలు నిర్వహిస్తూ, యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న గీతం విశ్వవిద్యాలయాల వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ఎం.వి.వి.ఎస్ మూర్తికి 'విద్యా రత్న'; ప్రముఖ నటులు, సినీ, నాటక రచయిత గొల్లపూడి మారుతీరావుకి 'సినీ రత్న'; అత్యధిక చలన చిత్రాల పంపిణీదారులు, నిబద్ధతతో వ్యాపారం చేస్తున్న ఉషా ఫిలిమ్స్ అధినేత డాక్టర్. వి.వి. బాల కృష్ణారావుకి 'విశిష్ట వ్యాపార రత్న'; కార్మిక స్థాయి నుండి ప్రజాకవిగా ఎదిగి ప్రజాభిమానాన్ని చూరగొంటున్న ప్రజాకవి వంగపండు ప్రసాదరావుకి 'రంగస్థల రత్న'; విదేశాలలో పని చేస్తూ ఎక్కువ డబ్బు గడించే అవకాశాలువచ్చినప్పటికీ వాటిన్నంటిని వదులుకొని మాతృదేశంలోనే ఉండి వేలాది మందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్. గుడారు జగదీష్‌కి 'వైద్య రత్న'; ‘మానవ సేవే మాధవ సేవగా’ భావిస్తూ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడానికి విద్యార్థులకు అవసరమైయ్యే శిక్షణను అందజేస్తూ వందలాది మంది యువత మంచి ఉద్యోగాల్లో స్థిరపడటానికి సహాయం చేస్తున్న మానవతావాది, తన స్వగ్రామాభివృద్ధికి ఎంతో పాటుపడుతున్న మాయలూరి మనోహర్ రెడ్డికి 'సేవారత్న'; అంధత్వ లోపం ఉన్నప్పటికీ దాన్ని లెక్కచేయకుండా తనకున్న అద్భుతమైన జ్ఞాపక శక్తి , స్ఫూర్తిదాయక ప్రసంగాలతో విశేష ప్రతిభ కనబరుస్తున్న షాకీర్ మహమ్మద్‌కి 'వినూత్న రత్న'; ఎన్ని అవాంతరాలు ఎదురైనా చెక్కుచెదరని ధైర్యంతో అన్నింటిని ఎదుర్కొని అంత్యంత చిన్నవయస్సులో, ప్రపంచంలోనే మొదటి మహిళా పైలట్‌గా (బోయింగ్ - 777) ఎంపికైన కెప్టెన్ అన్నే దివ్యకు 'యువ రత్న' పురస్కారాలను అందజేస్తున్నామని వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ప్రసాద్ తోటకూర, అధ్యక్షులు డాక్టర్. సి.ఆర్. రావులు ఓ పత్రికా ప్రకటనలో తెలియజేశారు. డాక్టర్. ప్రసాద్ తోటకూర (వ్యవస్థాపక అధ్యక్షులు), డాక్టర్. సి.ఆర్. రావు (అధ్యక్షులు), రావు కల్వల (ఉపాధ్యక్షులు), శారద అకునూరి ( కార్యదర్శి), చలపతి రావు కొండ్రకుంట (కోశాధికారి), రవి కొండబోలు, ధామా భక్తవత్సలు , డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం బోర్డు అఫ్ డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సంవత్సరం ఏలూరులో 4వ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవానికి మోహన్ ముళ్లపూడి సమన్వయకర్త గా వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలకు www.akkinenifoundationofamerica.orgను సందర్శించండి. -
డల్లాస్‌లో గాంధీ విగ్రహానికి బాబు నివాళి
డల్లాస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం డల్లాస్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. ఆలోచనాత్మకంగా, అత్యంత సుందరంగా మహాత్మాగాంధీ మెమోరియల్‌ను నిర్మించడంలో కీలకపాత్ర పోషించిన మహాత్మాగాంధీ మెమోరియల్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర నాయకత్వ ప్రతిభను ముఖ్యమంత్రి అభినందించారు. మిలియన్ డాలర్ల ఖర్చుతో నాలుగు సంవత్సరాల పాటు మెమోరియల్ నిర్మాణానికి శ్రమించిన డాక్టర్ ప్రసాద్ తోటకూర, ఎమ్జీఎమ్ఎన్టీ సభ్యులు రావు కల్వల, ఎంవీఎల్ ప్రసాద్, పీయూష్ పటేల్, జాన్ హామండ్, షబ్నమ్ మోద్గిల్, సల్మాన్ ఫర్షోరి, జాక్ గద్వాని, తైయబ్ కుండ్వాలా, కమల్ కౌశల్‌లను ముఖ్యమంత్రి కొనియాడారు. తీరికలేని షెడ్యూల్లో కూడా వీలు చేసుకుని మహాత్మాగాంధీ మెమోరియల్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు, ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, డాక్టర్ రవి వేమూరులకు, ఇతర ప్రభుత్వ ప్రతినిధులకు డాక్టర్ ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు. వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఎలా పాల్గొనవచ్చో, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రులతో నిరంతరం ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలో సూచిస్తూ డా. ప్రసాద్ తోటకూర ముఖ్యమంత్రికి ఓ లేఖను అందజేశారు. లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. 'నవ్యాoధ్రప్రదేశ్ నిర్మాణంలో మీరు చూపిస్తున్న చొరవ, చేస్తున్న అవిరళ కృషి బహుదా ప్రశంసనీయం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ మీ నాయకత్వములో నిర్మాణమౌతున్న అమరావతి రాజధాని నగర ప్రాభవానికై ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. విశ్వవ్యాప్తముగా ఉన్న తెలుగువారందరినీ కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా అందరినీ ఐక్యం చేసేవి మన సంస్కృతి, భాష, సాహిత్యం, సంగీతం, నృత్యం, లలిత కళలు. వీటిని ప్రవాసాంధ్రులకు కూడా సమంగా అందేలా చూడాలని కోరుతున్నాం. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రంగాల్లో సుప్రసిద్ధులైన కవులు, రచయితలు, చిత్రకారులు, నాట్య బృందాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంపిక చేసి విదేశాల్లో ఉన్న తెలుగువారికి మన జాతి గొప్పదనాన్ని తెలియజేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ప్రపంచంలో అనేక దేశాల్లో స్థిరపడిన శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్య, వ్యాపార రంగాల ప్రముఖులు ఎందరో ప్రతి రోజూ మన మాతృ దేశాన్ని ఏదో పని మీద సందర్శిస్తూనే ఉంటారు. అయితే వీరు వచ్చింది, వెళ్లిందీ ఎవరికీ తెలియకుండా పోతోంది. వీరిలో చాలా మంది విద్యా, వైద్య, వ్యాపార సంస్థల్లో తమకు ఉన్న అపార అనుభవాల్ని ఇతరులతో పంచుకోవడానికి, ఉచిత సేవలు అందించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. వీరికి ఒక వేదిక కల్పించినట్లయితే దేశ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలుగు సంతతికి చెందిన పిల్లల్లో కొంతమందిని ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వారిని ఆహ్వానించి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో కొంత కాలం పాటు పని చేసే ఏర్పాట్లు చేస్తే వారికి మన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, జీవన విధానం గురించి ఒక అవగాహన కల్పించడం ద్వారా తమ మూలాలు తెలుసుకునే వీలు కలుగుతుంది. అలాగే కళలు, క్రీడల్లో రాణిస్తున్న ప్రవాస తెలుగు పిల్లలకు మన దేశపు కళా, క్రీడా రంగాల్లో అద్వితీయ విజయాలు సాధిస్తున్న వారిని పరిచయం చేయడం ద్వారా పరస్పర ప్రయోజనాలు కలుగుతాయి. మన దేశంలో విద్యార్థినీ విద్యార్థులకు వివిధ రంగాల్లో పోటీలు నిర్వహించి విజేతలను విదేశాలకు పంపేటట్లుగా ప్రోత్సాహించినట్లయితే అనేక ప్రవాస తెలుగు కుటుంబాలు, వివిధ సంస్థలు కొంత కాలం పాటు వారికి ఆతిధ్యమిచ్చి పాశ్చాత్య సంస్కృతిపై ఒక అవగాహన కల్పించడానికి ముందుకు వస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రవాస భారతీయులతో అనుసంధానం కోసమై ఒక మంత్రిత్వ శాఖను కేటాయించినప్పటికీ అదే మంత్రికి ఈ శాఖతో పాటు పలు శాఖల బాధ్యతలు అప్పగించడం వల్ల దీనికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నారు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ ప్రవాస భారతీయులతో ఆయా కాలమానాల ప్రకారం ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి 24 గంటలూ పని చేసే ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే తప్ప ఆశించిన ఫలితాలు సిద్ధించవు. ఈ విషయం పై దృష్టి సారించి, విలువైన ప్రవాస భారతీయ మేధస్సును మన దేశ సేవకు ఉపయోగపడే విధంగా ప్రోత్సహించాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రతి ఏటా మన మాతృ దేశంలో 'ప్రవాస తెలుగు వార్షిక మహా సభలు' జరుపుతూ వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారిని ఆహ్వనించి వారి మేధస్సు, అనుభవాలను ఉపయోగించుకునేలా చేయాలని మనవి' -
డల్లాస్‌లోని 'గాంధీ స్మారకస్థలి'కి ఘననివాళులు
డల్లాస్: స్వతంత్ర భారత ప్రాభవదీప్తికి అహింసాయుధంతో మార్గం సుగమం చేసిన జాతిపిత మహాత్ముని బోధనలు, ఆదర్శాలే నేటి ప్రపంచానికి శరణ్యమని పద్మభూషణ్ పురస్కార గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. సోమవారం నాడు అమెరికా దేశపు 240వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, డల్లాస్‌లోని మహాత్మా గాంధీ స్మారకస్ధలిని ఆయన సతీసమేతంగా సందర్శించి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ ప్రసంగిస్తూ బరాక్ ఒబామా అధ్యక్షుడి హోదాలో భారత్ పర్యటించినప్పుడు పార్లమెంట్ ఇరుసభలనుద్దేశించి ప్రసంగిస్తూ తాను ఆ స్థాయికి చేరుకోవటానికి గాంధీజీ బోధనలే ఆదర్శంగా తీసుకున్నానని తెలిపారని వెల్లడించారు. ఐసిస్ ఉగ్రమూకల చర్యలతో అట్టుడుకుతోన్న నేటి ప్రపంచపటానికి నాడు గాంధీజీ ప్రవచించిన సిద్ధాంతాలే సరైన ఔషధమని, అవే ప్రపంచశాంతికి వెన్నుముక అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేడు పెద్ద ఎత్తున ఉద్యమంలా సాగిస్తున్న స్వచ్ఛభారత్ కార్యక్రమం గాంధీజీ ఆచరించి చూపిందేనని, దాన్ని విజయవంతం చేయటానికి భారతీయులు అహరహం శ్రమించాలని కోరారు. అనంతరం యార్లగడ్డ రచించిన "దక్షిణాఫ్రికాలో మహాత్మోదయం" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అమెరికా లోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ స్మారక స్థలి నిర్మాణం గావించి, భావి తరాలకు స్ఫూర్తి దాయకంగా నిల్పడంలో అతి చురకైన నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ స్మారకస్థలి కార్యవర్గ అధ్యక్షుడు డాక్టర్. తోటకూర ప్రసాద్ ను అయన కార్యవర్గాన్ని డాక్టర్. యార్లగడ్డ ప్రత్యేకంగా అభినందించారు. మహాత్మా గాంధీ స్మారకస్థలి కార్యవర్గ అధ్యక్షుడు డాక్టర్. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ 2014లో స్మారకస్థలి ఆవిష్కరణలో పాల్గొన్న యార్లగడ్డ నేడు తిరిగి ఇదే వేదిక వద్ద మహాత్ముని జీవిత అనుభవాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. అమెరికాలో అతిపెద్ద గాంధీ విగ్రహంగా ఖ్యాతికెక్కిన డల్లాస్‌లోని గాంధీ స్మారకస్థలి వద్ద అమెరికా స్వతంత్ర దినోత్సవం నాడు సమీకృతమవ్వడం గౌరవంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. అనంతరం అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను డాక్టర్. తోటకూర ప్రొఫెసర్. యార్లగడ్డకు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్. తోటకూర ప్రసాద్ అమెరికా దేశ ప్రజలకు స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలియజేశారు. మహాత్మా గాంధీ స్మారకస్థలి కార్యదర్శి రావు కల్వల మాట్లాడుతూ అన్ని రంగాలలోను ఎంతో అనుభవం ఉన్న ప్రొఫెసర్. యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను భారత ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ బిరుదు తో సత్కరించడం సముచితంగా ఉన్నదని, ఈ రోజు సతీ సమేతం గా వచ్చి మహాత్మా గాంధి కి నివాళులు అర్పించినండులకు కృతజ్ఞతలను తెలియజేశారు. స్మారకస్థలి కార్యవర్గ సభ్యులు షబ్నం మోద్గిల్, టాంటెక్స్ అధ్యక్షుడు సుభ్రమణ్యం జొన్నలగడ్డ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి డాక్టర్. యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, శ్రీమతి. యార్లగడ్డ, డాక్టర్. ప్రసాద్ తోటకూర, రావు కల్వల, షబ్నం మోడ్గిల్, కృష్ణా ఎన్నారై అధ్యక్షుడు డాక్టర్. పొన్నూరు సుబ్బారావు, తాతినేని రాం, డాక్టర్. సీ.ఆర్.రావు, ఎం. వి. ఎల్. ప్రసాద్, డాక్టర్. శ్రీనివాసరెడ్డి, వెంకట అనిల్ పొత్తూరు, డాక్టర్. ఉమామహేశ్వర రెడ్డి, శ్రీధర్ తుమ్మల, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.