కళాతపస్వికి అక్కినేని జీవిత సాఫల్యపురస్కారం
డాలస్లో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా బోర్డు సమావేశం
డాలస్, టెక్సాస్:
పద్మవిభూషణ్ డాక్టర్.అక్కినేని నాగేశ్వర రావు 94వ జయంతి సందర్భంగా డాలస్లో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా బోర్డు సమావేశం అయ్యింది. అమెరికాలో “అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” ను 2014 లో స్థాపించామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. తోటకూర ప్రసాద్ తెలిపారు. నాగేశ్వరరావు 'కృషి, పట్టుదల, ఆత్మస్తైర్యం, దూరదృష్టి' అనే విశిష్ట లక్షణాలు ముఖ్యంగా యువతరానికి స్ఫూర్తిదాయకం కావాలనే ఉద్దేశ్యంతో భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్కినేని అంతర్జాతీయ పురస్కారాన్ని జరుపుతున్నామన్నారు.
2014లో గుడివాడ, 2015 లో హైదరాబాద్, 2016లో చెన్నైలో జరిపామని తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్ 16 న ఏలూరులో ఈ పురస్కార ప్రదానోత్సవం జరుపుతున్నామని, ఈ సందర్భoగా వివిధ రంగాలలో నిష్ణాతులైన వారికి పురస్కారాలను అందజేస్తున్నామని తోటకూర ప్రసాద్ పేర్కొన్నారు. అనేక ఉత్తమ చిత్రాలు నిర్మించి తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి కె. విశ్వనాథ్‌కి “జీవిత సాఫల్య పురస్కారం” అందజేయనున్నట్టు వెల్లడించారు.
అత్యున్నత ప్రమాణాలతో విద్యా సంస్థలు నిర్వహిస్తూ, యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న గీతం విశ్వవిద్యాలయాల వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ఎం.వి.వి.ఎస్ మూర్తికి 'విద్యా రత్న'; ప్రముఖ నటులు, సినీ, నాటక రచయిత గొల్లపూడి మారుతీరావుకి 'సినీ రత్న'; అత్యధిక చలన చిత్రాల పంపిణీదారులు, నిబద్ధతతో వ్యాపారం చేస్తున్న ఉషా ఫిలిమ్స్ అధినేత డాక్టర్. వి.వి. బాల కృష్ణారావుకి 'విశిష్ట వ్యాపార రత్న'; కార్మిక స్థాయి నుండి ప్రజాకవిగా ఎదిగి ప్రజాభిమానాన్ని చూరగొంటున్న ప్రజాకవి వంగపండు ప్రసాదరావుకి 'రంగస్థల రత్న'; విదేశాలలో పని చేస్తూ ఎక్కువ డబ్బు గడించే అవకాశాలువచ్చినప్పటికీ వాటిన్నంటిని వదులుకొని మాతృదేశంలోనే ఉండి వేలాది మందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్. గుడారు జగదీష్కి 'వైద్య రత్న'; ‘మానవ సేవే మాధవ సేవగా’ భావిస్తూ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడానికి విద్యార్థులకు అవసరమైయ్యే శిక్షణను అందజేస్తూ వందలాది మంది యువత మంచి ఉద్యోగాల్లో స్థిరపడటానికి సహాయం చేస్తున్న మానవతావాది, తన స్వగ్రామాభివృద్ధికి ఎంతో పాటుపడుతున్న మాయలూరి మనోహర్ రెడ్డికి 'సేవారత్న'; అంధత్వ లోపం ఉన్నప్పటికీ దాన్ని లెక్కచేయకుండా తనకున్న అద్భుతమైన జ్ఞాపక శక్తి , స్ఫూర్తిదాయక ప్రసంగాలతో విశేష ప్రతిభ కనబరుస్తున్న షాకీర్ మహమ్మద్కి 'వినూత్న రత్న'; ఎన్ని అవాంతరాలు ఎదురైనా చెక్కుచెదరని ధైర్యంతో అన్నింటిని ఎదుర్కొని అంత్యంత చిన్నవయస్సులో, ప్రపంచంలోనే మొదటి మహిళా పైలట్గా (బోయింగ్ - 777) ఎంపికైన కెప్టెన్ అన్నే దివ్యకు 'యువ రత్న' పురస్కారాలను అందజేస్తున్నామని వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ప్రసాద్ తోటకూర, అధ్యక్షులు డాక్టర్. సి.ఆర్. రావులు ఓ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
డాక్టర్. ప్రసాద్ తోటకూర (వ్యవస్థాపక అధ్యక్షులు), డాక్టర్. సి.ఆర్. రావు (అధ్యక్షులు), రావు కల్వల (ఉపాధ్యక్షులు), శారద అకునూరి ( కార్యదర్శి), చలపతి రావు కొండ్రకుంట (కోశాధికారి), రవి కొండబోలు, ధామా భక్తవత్సలు , డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం బోర్డు అఫ్ డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సంవత్సరం ఏలూరులో 4వ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవానికి మోహన్ ముళ్లపూడి సమన్వయకర్త గా వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలకు www.akkinenifoundationofamerica.orgను సందర్శించండి.