డల్లాస్‌లో గాంధీ విగ్రహానికి బాబు నివాళి
డల్లాస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం డల్లాస్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. ఆలోచనాత్మకంగా, అత్యంత సుందరంగా మహాత్మాగాంధీ మెమోరియల్‌ను నిర్మించడంలో కీలకపాత్ర పోషించిన మహాత్మాగాంధీ మెమోరియల్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర నాయకత్వ ప్రతిభను ముఖ్యమంత్రి అభినందించారు.
మిలియన్ డాలర్ల ఖర్చుతో నాలుగు సంవత్సరాల పాటు మెమోరియల్ నిర్మాణానికి శ్రమించిన డాక్టర్ ప్రసాద్ తోటకూర, ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ సభ్యులు రావు కల్వల, ఎంవీఎల్ ప్రసాద్, పీయూష్ పటేల్, జాన్ హామండ్, షబ్నమ్ మోద్గిల్, సల్మాన్ ఫర్షోరి, జాక్ గద్వాని, తైయబ్ కుండ్‌వాలా, కమల్ కౌశల్‌లను ముఖ్యమంత్రి కొనియాడారు.
తీరికలేని షెడ్యూల్‌లో కూడా వీలు చేసుకుని మహాత్మాగాంధీ మెమోరియల్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు, ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, డాక్టర్ రవి వేమూరులకు, ఇతర ప్రభుత్వ ప్రతినిధులకు డాక్టర్ ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు.
వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఎలా పాల్గొనవచ్చో, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రులతో నిరంతరం ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలో సూచిస్తూ డా. ప్రసాద్ తోటకూర ముఖ్యమంత్రికి ఓ లేఖను అందజేశారు. లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి.
'నవ్యాoధ్రప్రదేశ్ నిర్మాణంలో మీరు చూపిస్తున్న చొరవ, చేస్తున్న అవిరళ కృషి బహుదా ప్రశంసనీయం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ మీ నాయకత్వములో నిర్మాణమౌతున్న అమరావతి రాజధాని నగర ప్రాభవానికై ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. విశ్వవ్యాప్తముగా ఉన్న తెలుగువారందరినీ కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా అందరినీ ఐక్యం చేసేవి మన సంస్కృతి, భాష, సాహిత్యం, సంగీతం, నృత్యం, లలిత కళలు. వీటిని ప్రవాసాంధ్రులకు కూడా సమంగా అందేలా చూడాలని కోరుతున్నాం.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రంగాల్లో సుప్రసిద్ధులైన కవులు, రచయితలు, చిత్రకారులు, నాట్య బృందాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంపిక చేసి విదేశాల్లో ఉన్న తెలుగువారికి మన జాతి గొప్పదనాన్ని తెలియజేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ప్రపంచంలో అనేక దేశాల్లో స్థిరపడిన శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్య, వ్యాపార రంగాల ప్రముఖులు ఎందరో ప్రతి రోజూ మన మాతృ దేశాన్ని ఏదో పని మీద సందర్శిస్తూనే ఉంటారు.
అయితే వీరు వచ్చింది, వెళ్లిందీ ఎవరికీ తెలియకుండా పోతోంది. వీరిలో చాలా మంది విద్యా, వైద్య, వ్యాపార సంస్థల్లో తమకు ఉన్న అపార అనుభవాల్ని ఇతరులతో పంచుకోవడానికి, ఉచిత సేవలు అందించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. వీరికి ఒక వేదిక కల్పించినట్లయితే దేశ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలుగు సంతతికి చెందిన పిల్లల్లో కొంతమందిని ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వారిని ఆహ్వానించి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో కొంత కాలం పాటు పని చేసే ఏర్పాట్లు చేస్తే వారికి మన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, జీవన విధానం గురించి ఒక అవగాహన కల్పించడం ద్వారా తమ మూలాలు తెలుసుకునే వీలు కలుగుతుంది.
అలాగే కళలు, క్రీడల్లో రాణిస్తున్న ప్రవాస తెలుగు పిల్లలకు మన దేశపు కళా, క్రీడా రంగాల్లో అద్వితీయ విజయాలు సాధిస్తున్న వారిని పరిచయం చేయడం ద్వారా పరస్పర ప్రయోజనాలు కలుగుతాయి. మన దేశంలో విద్యార్థినీ విద్యార్థులకు వివిధ రంగాల్లో పోటీలు నిర్వహించి విజేతలను విదేశాలకు పంపేటట్లుగా ప్రోత్సాహించినట్లయితే అనేక ప్రవాస తెలుగు కుటుంబాలు, వివిధ సంస్థలు కొంత కాలం పాటు వారికి ఆతిధ్యమిచ్చి పాశ్చాత్య సంస్కృతిపై ఒక అవగాహన కల్పించడానికి ముందుకు వస్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రవాస భారతీయులతో అనుసంధానం కోసమై ఒక మంత్రిత్వ శాఖను కేటాయించినప్పటికీ అదే మంత్రికి ఈ శాఖతో పాటు పలు శాఖల బాధ్యతలు అప్పగించడం వల్ల దీనికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నారు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ ప్రవాస భారతీయులతో ఆయా కాలమానాల ప్రకారం ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి 24 గంటలూ పని చేసే ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే తప్ప ఆశించిన ఫలితాలు సిద్ధించవు. ఈ విషయం పై దృష్టి సారించి, విలువైన ప్రవాస భారతీయ మేధస్సును మన దేశ సేవకు ఉపయోగపడే విధంగా ప్రోత్సహించాలని కోరుతున్నాం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రతి ఏటా మన మాతృ దేశంలో 'ప్రవాస తెలుగు వార్షిక మహా సభలు' జరుపుతూ వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారిని ఆహ్వనించి వారి మేధస్సు, అనుభవాలను ఉపయోగించుకునేలా చేయాలని మనవి'