అమెరికా విమానాశ్రయాల వద్ద తనిఖీలు ముమ్మరం
వాషింగ్టన్: అమెరికాలో ట్రావెల్ బ్యాన్ అమల్లోకి వచ్చింది. ఆరు ముస్లిం దేశాల పౌరుల రాకపై నిషేధానికి కొన్ని షరతులతో అమెరికా సుప్రీంకోర్టు అనుమతించడంతో శుక్రవారం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద తనిఖీలు ప్రారంభించారు. ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకుని గంటల కొద్దీ ప్రశ్నించారు. వారిలో కొందర్ని వెనక్కి పంపారు.
మరోవైపు ఎవరినైనా అక్రమంగా నిర్బంధిస్తే.. వారికి న్యాయసాయం కోసం విమానాశ్రయాల వద్ద న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. న్యూయార్క్, లాస్ ఎంజెలెస్, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో, వాషింగ్టన్, ఇతర నగరాల్లోని విమానాశ్రయాల్లో ఈ కేంద్రాలు వెలిశాయి. కొన్ని చోట్ల అరబిక్‌లో బ్యానర్లు దర్శనమిచ్చాయి.
కొందరు కుటుంబసభ్యులకే అనుమతి
కింది కోర్టులు విధించిన స్టేలతో ఐదు నెలలుగా ట్రావెల్ బ్యాన్ అమల్లోకి రాలేదు. ఇటీవల సుప్రీం కోర్టు స్టే ఎత్తివేసింది. నాటి నిషేధ ఉత్తర్వుల ప్రకారం.. ఇరాన్, లిబియా, సొమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ నుంచి వచ్చే పౌరుల్ని 90 రోజుల పాటు అమెరికాలోకి రాకుండా అడ్డుకుంటారు. శరణార్థులపై 120 రోజుల పాటు నిషేధం ఉంటుంది. అమెరికాలో సన్నిహితులుంటే మాత్రం అడ్డుకోవద్దని సుప్రీంకోర్టు ట్రంప్ సర్కారును ఆదేశించింది. కాగా అమెరికన్ హోంల్యాండ్ భద్రతా విభాగం సన్నిహితుల జాబితాను తయారుచేస్తూ.. తల్లిదండ్రులు, భార్య లేదా భర్త, పిల్లలు, కోడలు, అల్లుడు, సోదరి, సోదరులు ఇలా కొందరినే ప్రవేశానికి అనుమతిస్తామంది.