వాషింగ్టన్: ‘వైట్ పవర్’అంటూ ప్రెసిడెంట్ వ్యతిరేకులను ఉద్దేశించి ఆయన మద్దతుదారుడు చేసిన జాత్యహంకార నినాదాలతో నిండిన వీడియోను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోమవారం ట్విట్టర్లో పోస్టు చేశారు. దానిపై వ్యతిరేకత రావడంతో కొన్ని గంటల్లోనే డిలీట్ చేశారు. దీనిపై వైట్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘వైట్ పవర్’నినాదాన్ని ప్రెసిడెంట్ వినలేదని చెప్పింది. అందుకే వీడియోను ట్వీట్ చేశారని పేర్కొంది. (భారత్‌పై నేపాల్ ప్రధాని తీవ్ర ఆరోపణలు)
డెమొక్రాట్లు రానున్న ఎన్నికల్లో మళ్లీ పరాజయం చెందుతారంటూ ట్రంప్ సోమవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో విద్వేషపూరిత వ్యాఖ్యలున్న వీడియోను జత చేసి పోస్టు చేశారు. అందులో గోల్ఫ్ బండిలో ట్రంప్ 2020, అమెరికా ఫస్ట్ అనే ప్లకార్డుతో వస్తున్న వ్యక్తిని కొందరు అడ్డగిస్తారు. ఈ సందర్భంగా అతడు వైట్ పవర్ అంటూ జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తాడు. ఈ వీడియోను ఫ్లోరిడాలో తీసినట్లు భావిస్తున్నారు. (పథకం ప్రకారమే డ్రాగన్ దాడి!)
దీనిపై ట్విట్టర్లో దుమారం రేగింది. పలువురు ట్రంప్ తీరుపై విమర్శలు గుప్పించారు. దీంతో వెనక్కు తగ్గిన ట్రంప్ ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఆ వెంటనే వైట్‌హౌజ్ ట్రంప్ జాత్యహంకారపూరిత వ్యాఖ్యలను వినకుండా పోస్టు చేశారంటూ సంజాయిషీ ఇచ్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment