నీవు నేర్పిన విద్యనే అధ్యక్షా...! | Trumps Hand Left With Thumbprint After Macron Handshake | Sakshi
Sakshi News home page

నీవు నేర్పిన విద్యనే అధ్యక్షా...!

Published Mon, Jun 11 2018 10:00 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

Trumps Hand Left With Thumbprint After Macron Handshake - Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌

దెబ్బకు దెబ్బ రుచి అంటే ఏమిటో అగ్రరాజ్య అధినేత డొనాల్డ్‌ ట్రంప్‌కు తాజాగా స్వానుభవానికి వచ్చింది. తన ధృడమైన కరచాలనంతో స్త్రీ, పురుషుడనే తేడా లేకుండా ఇతర దేశాధినేతలను ‘నొక్కిన’ చరిత్ర ఆయనకుంది. ఈ రకమైన ట్రేడ్‌మార్క్‌ షేక్‌హ్యాండ్‌లతో విదేశీ ప్రముఖులను అదరగొట్టే ట్రంప్‌ను ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యువల్‌ మాక్రన్‌ అదే తరహాలో తన ఉక్కు పిడికిలి బిగించి చేసిన ప్రత్యేక కరచాలనంతో చుక్కలు చూపించాడు.  ఇటీవల కెనడాలో జరిగిన జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో అరుదైన ఈ దృశ్యం చోటు చేసుకుంది. ట్రంప్‌ కుడిచేయిని మాక్రన్‌ ఎంత గట్టిగా, బలంగా నొక్కాడంటే ఎర్రగా కమిలిపోయింది. ఈ షేక్‌హ్యాండ్‌ పూర్తయ్యాక ట్రంప్‌ కుడిచేయి వెనక మాక్రన్‌ బొటనవేలు గుర్తు ముద్రించుకు పోయేంత దృఢంగా...దాదాపు 30 సెకన్లపాటు సాగిన ఈ కరచాలనంలో తాను పడిన బాధను పళ్ల బిగువున కప్పిపుచ్చుకునేందుకు ట్రంప్‌ ప్రయత్నించారు.

 కుడికన్ను గీటుతూ ట్రంప్‌పై తనదే పై చేయి అన్నట్టుగా మాక్రన్‌ విజయదరహాసం చేశారు. ‘ ఆర్మ్‌ రెస్లింగ్‌లో మాక్రన్‌ను ఓడించడం కొంచెం కష్టమైనదే. అయితే మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు. మొదటి నుంచి మా ఇద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి’ అంటూ ఈ ఘటన అనంతరం ట్రంప్‌ వ్యాఖ్యానించినట్టు సీఎన్‌ఎన్‌ పేర్కొంది. ఈ షేక్‌హ్యాండ్‌లో  71 ఏళ్ల ట్రంప్‌  40 ఏళ్ల మాక్రన్‌తో చేతులు కలిపి ఉంచడానికి పడిన ఇబ్బందికి  సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఆన్‌లైన్, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ట్విటర్‌లోనైతే ఎడతెగని చర్చలతో పాటు పలువురు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

- ‘1980 దశకం నాటి హ్యాండ్‌షేక్‌లతో తన సామర్థ్యాన్ని, బలాన్ని చాటుకోవాలని చూస్తున్న ట్రంప్‌నకు చివరకు మాక్రన్‌ కరచాలనం రూపంలో గుణపాఠం దొరికినట్టు అయ్యింది’ అంటూ కమ్యూనియ కొమ్యునియ ట్విటర్‌ అకౌంట్‌తో స్పందించారు. 
- ‘ బలప్రయోగంతో కూడిన షేక్‌హ్యాండ్‌కు ప్రసిద్ధుడైన ట్రంపే ఇప్పుడు మాక్రన్‌ చేతుల్లో బాధితుడయ్యాడు. చూడండి..పాపం ట్రంప్‌ చేతులపై మాక్రన్‌ వేలి గుర్తులు..శక్తి అనేది బలమైనదని తేలింది’ అని చ్యుంగ్యెయన్‌ చౌ వ్యాఖ్యానించాడు.
- ‘హ్యాండ్‌షేక్‌ క్రీడలో మాక్రన్‌ విజయం సాధించాడు’ అంటూ నిక్‌ వెన్‌మీకర్స్‌ పేర్కొన్నాడు.
- ‘ట్రంప్‌ మార్క్‌ గొరిల్లా పట్టు కరచాలనానికి మాక్రన్‌ గట్టి సమాధానమే ఇచ్చినట్టున్నాడు’ అని ఎరిక్‌ కొలంబస్‌ మరో వ్యాఖ్యకు సమాధానమిచ్చాడు. 
- ‘ఇదొ గొప్ప ఫోటో ప్రేం...ట్రంప్‌ చేతిపై మాక్రన్‌ బొటనవేలు ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది’ అంటూ కోరినె పెర్కిన్స్‌ వ్యాఖ్యానించారు. 
- ‘ శరీరాకృతిలో పోల్చితే మాక్రన్‌  చిన్నగా ఉన్నా 71 ఏళ్ల ట్రంప్‌నకు ఎవరు బాసో తెలియజేశాడు. ఇది నిజంగా అభినందించదగ్గదే’ నని హేచ్‌ఎంపీఆ స్లేడ్‌ అన్నాడు. 
- ‘ట్రంప్‌ గొంతు చుట్టూ (చేతిపై కాకుండా) మాక్రన్‌ వేళ్లు లేకపోవడం విచారకరమే’ అంటూ వ్యంగ్యంగా డాన్‌ క్యాంప్‌బెల్,, ‘ఈ సారి అవకాశమొస్తే గొంతుపై ఈ ప్రయత్నమే చేయాలి’ అని హాస్యపూర్వకంగా జాన్‌ స్టీవెన్స్‌ పేర్కొన్నాడు.

అయితే...వీరిద్దరి మధ్య ఇదే మొదటి షేక్‌హ్యాండ్‌ కాదు. గతేడాది ప్రాన్స్‌లో కలుసుకున్నపుడు ఇద్దరి మెటికలు తెల్లగా పాలిపోయే వరకు గట్టిగా పట్టుకున్నారు. ఈ ఏడాది మొదట్లో మాక్రన్‌ అధికారిక పర్యటన సందర్భంగా వైట్‌హౌస్‌లో  చోటు చేసుకున్న ఇద్దరు దేశాధినేతల  కరచాలనం కొంత వికారంగా, ఇబ్బందికరంగా మారాక, ఆ తర్వాత అది వారిద్దరి ఆలింగనానికి దారితీసింది.  వివిధ దేశాల అధిపతుల అమెరికా పర్యటన సందర్భంగా లేదా ట్రంప్‌ విదేశ పర్యటనల సందర్భంగా ట్రంప్‌ అనుసరించే ధోరణి, ప్రదర్శించే పెద్దన్న వైఖరి వల్ల గతంలో వివిధ దేశాల ప్రముఖులు చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు వార్తలొచ్చాయి. గతేడాది అమెరికా పర్యటనకు వెళ్లినపుడు ట్రంప్‌ ఆధిపత్య షేక్‌హ్యాండ్‌కు ప్రధాని నరేంద్ర  మోదీ తన ట్రేడ్‌ మార్క్‌ ‘ఎలుగుబంటి ఆలింగనం’  (బేర్‌ హగ్‌)తో సమాధానమిచ్చేశారని ట్విటర్‌వేదికగా చర్చ కూడా సాగింది. 
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement