
ఈ రోజు సెకను అదనం
వాషింగ్టన్: మామూలుగా రోజుకు 24 గంటలు. అయితే ఈ రోజు(జూన్ 30)కు మాత్రం ఒక సెకన్ అదనంగా చేరనుంది. భూమి స్వయం ప్రదక్షిణ సమయం తగ్గుతుండడంతో ఈ లీప్ సెకనును కలుపుతున్నట్లు నాసాకు చెందిన గొడార్డ్ స్పేస్ ఫైట్ సెంటర్ శాస్త్రవేత్త డేనియల్ మాక్‌మిలన్ తెలిపారు. జూన్ 30కి సాధారణంగా ఉండాల్సిన 86,400 సెకన్లకు ఒక సెకను కలిపి 86,401 సెకన్లుగా పరిగణించనున్నట్లు వెల్లడించారు.
దీంతో యూనివర్సల్ కోఆర్డినేటెడ్ టైమ్(యూటీసీ) అర్ధరాత్రి 23:59:59 నుంచి 00:00:00 కు బదులు 23:59:60గా, తర్వాత 00:00:00(జూలై1)గా ఉంటుంది. దీనివల్ల తలెత్తే సమస్యల పరిష్కారం కోసం సాఫ్ట్‌వేర్ సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయి. స్థిరంగా కొనసాగే ఆటమిక్ టైమ్‌కు భూ స్వయం ప్రదక్షిణ సమయాన్ని అనుసంధానం చేసేందుకు లీప్ సెకనును కలుపుతుంటారు.
భూమి తన చుట్టూ తాను తిరగడానికి 86,400.002 సెకన్లు పడుతోంది. అంటే ఈ వేగం ప్రతిరోజూ సెకనులో 2వేల వంతు తగ్గుతూ ఉంటుంది. భూమి, సూర్యుడు, చంద్రుడి మధ్య గురుత్వాకరణ బలాలు దీనికి కారణం. ఈ నామమాత్రం తగ్గుదల ఏడాదంతా కొనసాగితే దాదాపు ఒక సెకను అదనంగా చేరినట్లే. ఈ నేపథ్యంలో అవసరమైనపుడు సమయాన్ని సరిచేసేందుకు యూటీసీకి జూన్ 30న కానీ, డిసెంబర్ 31న కానీ లీప్ సెకండ్‌ను కలుపుతుంటారు. తొలిసారి 1972లో లీప్ సెకండ్‌ను కలపడం ప్రారంభించారు. ఇప్పటివరకు 26 సార్లు కలిపారు.