
'మేమేం రష్యాపై ఆధారపడం.. చాలా దేశాలున్నాయి'
ఇస్తాంబుల్: తామేం రష్యాపై ఆధారపడబోమని టర్కీ ప్రకటించింది. రష్యాకాకపోతే అలాంటి దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయంటూ వ్యాఖ్యానించింది. రష్యా యుద్ధ విమానాన్ని కూల్చివేసినప్పటికి నుంచి టర్కీ, రష్యాల మధ్య వైరుధ్యం పెరుగుతూనే ఉంది. నిన్నమొన్నటి వరకు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్న ఆ దేశాలు ఇక తమ మధ్య ఎలాంటి సహకారం ఉండబోదని ముందుగానే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అణువిద్యుత్ కోసం తామేం రష్యాపై ఆధారపడబోమని టర్కీ బుధవారం ప్రకటన చేసింది. సాంకేతిక పరిజ్ఞానం పొందే విషయంలో తామేం ఒకరి ఇంటి గుమ్మం ముందు సాగిలపడబోమంటూ టర్కీ వ్యాఖ్యానించింది.
రష్యాకు చెందిన అణువిద్యుత్ సంస్థ రోసాటోమ్ టర్కీలోని మెర్సిన్ ప్రావిన్స్ లో గల అక్కుయులో అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రారంభించింది. కాగా, ఇటీవల రష్యా కు చెందిన యుద్ద విమానాన్ని టర్కీ కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఒక్క రష్యా ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గమే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఆగ్రహంతో ఊగిపోయారు.
ఈ నేపథ్యంలో ఈ ప్లాంటును నిర్మాణిస్తున్న రష్యాకు చెందిన సంస్ధ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు నిరాసక్తత చూపించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా టర్కీ డిప్యూటీ ప్రధాని నుమన్ కుర్తుల్మస్ ఈ ప్రకటన చేశాడు. రష్యా ఒక్కటే కాదని, ఎన్నో దేశాలు తమ డిమాండ్లకు తగిన విధంగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రష్యా తలపెట్టిన ఈ ప్లాంటు పూర్తయితే టర్కీలో తొలి అణువిద్యుత్ ప్లాంట్ గా నిలిచేది.