అక్కడ ఫేస్‌బుక్ కన్నా ట్విట్టర్ పెద్దది!
న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని ఆధిపత్యం. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ యూజర్లతో ప్రపంచమంతటా సోషల్ మీడియా రంగంలో నంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే జపాన్‌కు వచ్చేసరికి మాత్రం ఇది తల్లకిందులైంది. ఫేస్‌బుక్‌ను వెనక్కినెట్టి ట్విట్టర్ ఆ దేశంలో నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్‌లో ఫేస్‌బుక్ కన్నా ట్విట్టర్‌కే అధిక యాక్టివ్ యూజర్లు ఉన్నారు.
గడిచిన ఏడాది చివరినాటికి జపాన్‌లో ట్విట్టర్‌కు 35 మిలియన్ల (3.5 కోట్ల) మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారని, దీనిని బట్టి జపాన్‌లో ట్విట్టర్ ది నంబర్ వన్ అని వాల్‌స్ట్రీట్ జర్నల్ శనివారం ఓ కథనంలో పేర్కొంది. జపాన్‌లో ఫేస్‌బుక్‌కు 25 మిలియన్ల (2.5 కోట్ల) యాక్టివ్ యూజర్లు మాత్రమే ఉన్నారని తెలిపింది. అమెరికా వెలుపల తనకు ఉన్న యూజర్ల గురించి ట్విట్టర్ వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ కథానాన్ని ప్రచురించింది.
ట్విట్టర్ ఇటీవల వెల్లడించిన మూడో త్రైమాసిక ఆదాయాలతో దాని పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ లోకి కొత్త యూజర్ల సంఖ్య జపాన్‌లో కూడా తగ్గినట్టు ఈ వివరాలు వెల్లడించాయి. అయితే నాలుగో త్రైమాసికంలోని గడిచిన నెలరోజుల్లోనే 320 మిలియన్ల కొత్త యూజర్లు ట్విట్టర్‌లో చేరారని, అంతకుముందు నెలలోనూ యూజర్ల సంఖ్య ఇదేస్థాయిలో పెరిగిందని ట్విట్టర్ వెల్లడించడం కొంత ఊరట పరిచింది.