అమెరికాలో పేలుడు, ఇద్దరి మృతి
రెండు భవనాలు కుప్పకూలి ఇద్దరి మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరం సమీపంలోని ఈస్ట్ హార్లెమ్‌లో బుధవారం ఉదయం శక్తిమంతమైన పేలుడు సంభవించి రెండు భవనాలు కుప్పకూలాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు మరణించడంతోపాటు 20 మంది గాయపడ్డారు. మరికొంత మంది ఆచూకీ తెలియడం లేదు. ఉదయం 9 గంటల సమయంలో తొలుత గ్యాస్ లీక్ అయినట్లు వాసన వచ్చిందని, తర్వాత భారీ శబ్దంతో పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు, పొగ అలుముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీలు, అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. పేలుడు జరిగిన వెంటనే బాంబ్ స్క్వాడ్‌లతో సహా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదని, ఇది ఉగ్రవాద దాడి కాకపోవచ్చని అధికారవర్గాలు పేర్కొన్నాయి.