దావూద్ వేట షురూ.. ఆస్తులు సీజ్!
న్యూఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం షాకిచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న అతడి ఆస్తులన్నింటిని సీజ్ చేసేందుకు ముందడుగేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని భారత ఇంటెలిజెన్స్‌గానీ, దర్యాప్తు సంస్థలుగానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. తమకు యూఏఈ నుంచి దీనికి సంబంధించి సమాచారం ఇంకా రాలేదని అంటున్నాయి. అయితే, యూఏఈ సీజ్ చేసిన ఆస్తులు విలువ దాదాపు రూ.15వేల కోట్లు ఉంటుందని అంచనా. 1993నాటి ముంబై పేలుళ్లకు ప్రధాన కారణం దావూద్ ఇబ్రహీం అని తెలిసిందే. ఇంకా ఎన్నో నేరాలు అతడు చేశాడు.
అతడి కోసం భారత్ ఎప్పటి నుంచో వెతుకుతోంది. పాక్‌లోనే అతడు తలదాచుకున్నాడని తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యూఏఈ తాము నేరస్తులకు, ఉగ్రవాదులకు వ్యతిరేకం అని పరోక్షంగా చెప్పింది. దీంతోపాటు ప్రధాని నరేంద్రమోదీ 2015లో యూఏఈ పర్యటనకు వెళ్లినప్పుడు దావూద్ విషయాన్ని అక్కడ ప్రభుత్వానికి చెప్పడమే కాకుండా అతడి ఆస్తుల వివరాలను అందించి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే అతడి ఆస్తులు సీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇంకా ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది.