భారతీయ దంపతుల కూతురు
దుబాయ్: తమ దేశ చట్టాలను పక్కన పెట్టి ఇద్దరు భారతీయ నిర్వాసితులకు పుట్టిన శిశువుకు జనన ధృవీకరణ పత్రం జారీ చేసి యూఏఈ ప్రభుత్వం తన ఔదార్యతను ప్రదర్శించింది. జనన ధృవీకరణ పత్రం జారీ చేయడంలో ఔదార్యత ప్రదర్శించడం ఏమిటి అని సందేహం తొలుస్తుంది కదూ. కానీ యూఏఈ చట్టాల ప్రకారం ఇతర దేశాల నుంచి వచ్చి యూఏఈలో నివాసముంటున్న వారు పెళ్లి చేసుకోవాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి. ముస్లిం పురుషుడు, ముస్లిమేతర మహిళను పెళ్లి చేసుకోవచ్చు కానీ ముస్లిం మహిళ... వేరే మతానికి చెందిన పురుషుడిని పెళ్లి చేసుకోరాదు.
షార్జాకు చెందిన కిరణ్ బాబు, సనమ్ సాబూ సిద్ధిఖీలు 2016లో కేరళలో పెళ్లి చేసుకున్నారు. కిరణ్ బాబు హిందువు కాగా.. సనమ్ సాబూ సిద్ధిఖీ ముస్లిం. వీరిద్దరికీ 2018 జూలైలో కూతురు పుట్టింది. అయితే కుమార్తె జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి. దీనిపై కిరణ్ బాబు మాట్లాడుతూ...‘నాకు అబుదాబి వీసా ఉంది. అక్కడే ఇన్సూరెన్స్ కవరేజీ కూడా తీసుకున్నాను. అక్కడే ఉన్న మెదియోర్ 24/7 ఆసుపత్రిలో నా భార్యను డెలివరీ నిమిత్తం చేర్పించాను. నేను హిందువును కావడంతో నా కూతురికి జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. ఆ తర్వాత కోర్టు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాను. విచారణ నాలుగు నెలలు సాగింది. నా కేసును కోర్టు కొట్టేసింద’ని వెల్లడించారు.
తన కూతురుకు ఎలాంటి లీగల్ డాక్యుమెంట్లు లేకపోవడంతో ఆశలన్నీ యూఏఈ ప్రభుత్వ క్షమాభిక్షపైనే పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ఇండియన్ ఎంబసీ కూడా తనకు బాగా సహకరించిందని కిరణ్ బాబు తెలిపారు. జనన ధృవీకరణ పత్రం జారీలో సహాయపడిన ఇండియన్ ఎంబసీ కౌన్సెలర్ ఎం రాజమురుగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నిబంధనలు మార్చి జనన ధృవీకరణ పత్రం జారీ చేయడం దేశంలో ఇదే మొదటిదని ఆయన తెలిపారు. కాగా ఔదార్యత చూపే దేశాల్లో యూఏఈ అందరికంటే ముందుంటుందని చెప్పటానికి యూఏఈ ప్రభుత్వం 2019 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ టోలరెన్స్‌గా ప్రకటించింది. రెండు విభిన్న సంస్కృతులను కలిపే విధంగా, ఇతర మతాలను ప్రజలు అనుమతించే వాతావరణం కల్పించటంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని యూఏఈ చేపట్టింది. జనన ధృవీకరణ పత్రం జారీచేయడం పట్ల దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment