ఇక ఉబర్ బైక్ ట్యాక్సీలు!
బ్యాకాక్: ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చడంలో ఇటీవలి కాలంలో ఆన్లైన్ ట్యాక్సీ సర్వీస్ల జోరు పెరిగిపోయింది. అమెరికాకు చెందిన ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ సంస్థ ఉబర్.. మోటార్ బైక్ ట్యాక్సీలను సైతం ప్రవేశపెడుతోంది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో మోటార్ బైక్ ట్యాక్సీ సర్వీస్ను ఉబెర్ బుధవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇప్పటికే వేల మంది బైక్ డ్రైవర్లను ఈ ప్రాజెక్టు కోసం సంస్థ నియమించుకుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ సర్వీస్ ప్రయోజనకరంగా ఉంటుందని ఉబర్ భావిస్తోంది.
కారు ట్యాక్సీ సర్వీస్తో పోల్చినప్పుడు మోటార్ బైక్ ట్యాక్సీ సర్వీస్ ధరలు తక్కువగా ఉంటాయని సంస్థ ప్రతినిధి డగ్లస్ మా తెలిపారు. త్వరలోనే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి ఆసియాలోని ఇతర ప్రాంతాల్లోకి సైతం ఈ సేవలను విస్తరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బైక్ ట్యాక్సీ సర్వీస్తో దూసుకుపోతున్న తమ పోటీదారు గ్రాబ్ టాక్సీని ఎదుర్కొనేందుకే ఉబెర్ ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అయితే, మోటార్ బైక్ ట్యాక్సీల వలన తమ ఉపాధి దెబ్బతింటుందని స్థానికంగా ఉన్నటువంటి ట్యాక్సీవాలాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.