యూకే వీసా పాలసీలో మార్పులు
లండన్: పెరిగిపోతున్న వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు బ్రిటన్ ప్రభుత్వం వీసా పాలసీలో మార్పులు చేసింది. యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చెందని దేశాల పౌరులకు వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. యూకే సర్కారు తాజా నిర్ణయంతో భారతదేశానికి చెందిన ఐటీ రంగ నిఫుణులపై ఎక్కువగా ప్రభావం పడనుంది. యునెటైడ్ కింగ్‌డమ్ హోం ఆఫీస్ ప్రకటించిన కొత్త వీసా నిబంధనల ప్రకారం.. టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్‌సఫర్(ఐసీటీ) కేటగిరీ కింద నవంబర్ 24 తర్వాత వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి కనీస వార్షిక వేతనం 30,000 పౌండ్లు ఉండాలి. ఇప్పటి వరకూ ఇది 20,800 పౌండ్లుగా ఉంది.
బ్రిటన్‌లోని భారత ఐటీ కంపెనీలు ఈ ఐసీటీ కేటగిరీనే ఎక్కువగా వినియోగించుకుంటున్నాయని, సుమారు 90 శాతం మంది భారత ఐటీ నిఫుణులు ఐసీటీ కిందే వీసా పొందారని యూకే మైగ్రేషన్ అడ్వయికమిటీ(ఎంఏసీ) ఇటీవల వెల్లడించింది. బ్రిటన్ ప్రధాని థెరెసా మే మూడు రోజుల పర్యటనకు ఆదివారం భారత్‌కు రానున్న నేపథ్యంలో వీసా మార్పుల ప్రకటన రావడం గమనార్హం. టైర్ 2 వీసా జారీకి సంబంధించి ఎంఏసీ సూచనల మేరకు మార్చిలో రెండు దశల మార్పులను యూకే ప్రభుత్వం ప్రారంభించింది.
టైర్ 2 ఐసీటీతో పాటు ఇతర విభాగాల్లో కూడా వేతన పరిమితిని పెంచింది బ్రిటన్ ప్రభుత్వం. టైర్ 2(జనరల్) ఉద్యోగులకు కొన్ని మినహాయింపులతో 25,000 పౌండ్లు వేతనం ఉండాలని నిర్దేశించారు. ఇక ట్రైనీలుగా వచ్చే టైర్ 2(ఐసీటీ) గ్రాడ్యుయేట్ ట్రైనీల వేతన పరిమితి 23,000 పౌండ్లుగా నిర్ణరుుంచారు. దీంతోపాటు ఒక్కో కంపెనీ ఏటా 20 మందిని మాత్రమే ఇలా తీసుకురావాలని నిబంధన విధించారు. టైర్ 4 కేటగిరీలోనూ పలు మార్పులు చేశారు.