బ్రిటన్‌లో ‘బారసాల’ వివాదం!
బ్రిటన్లో ఓ బారసాల వివాదం కోర్టుకెక్కింది. పుట్టిన బిడ్డకు వెంటనే పేరు పెట్టకపోవటం తల్లిదండ్రులను న్యాయస్థానం మెట్లు ఎక్కించింది. మన హిందు మత సంప్రదాయాల ప్రకారం ‘బారసాల’ వేడుక నిర్వహించిన తర్వాతగానీ పిల్లలకు పేరు పెట్టరు. అప్పటివరకు తమ బిడ్డలను ఏదో ఒక ముద్దు పేరుతో తల్లిదండ్రులు పిలుచుకుంటారు. ఇది మన దగ్గర సార్వసాధారణం. అయితే ఇదే సంప్రదాయం బ్రిటన్‌లో నేరమైంది. బ్రిటన్‌కు చెందిన ఓ హిందూ దంపతులు తమ చిన్నారికి పుట్టిన ఐదు నెలల తర్వాత కూడా పేరు పెట్టకపోవడాన్ని తప్పుబడుతూ బ్రిటన్ కోర్టు తీర్పునిచ్చింది.
చిన్నారికి పేరు పెట్టకపోవడం ‘భావోద్వేగపరంగా హాని చేయడమేనని’ పేర్కొంటూ.. శిశువును సోషల్ కేర్ సెంటర్‌కి అప్పగించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో హెర్ట్‌ఫోర్డ్‌కు చెందిన హిందూ దంపతులు అప్పీల్ కోర్టును ఆశ్రయించారు. హిందూ మత సంప్రదాయం ప్రకారం బారసాల వేడుకను ఘనంగా నిర్వహించి చిన్నారికి పేరు పెడతామని, అప్పటివరకు తమకు అనుమతి ఇవ్వాలని వారు కోర్టును వేడుకున్నారు. అంతవరకూ తమ బిడ్డను తమ నుంచి వేరు చేయవద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.