రోమ్: లిబియాలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. యూరప్‌కు బయలుదేరిన 50 మంది శరణార్థులతో కూడిన చిన్న పడవ మునిగిపోవడంతో దాదాపు 30 మంది చనిపోయినట్లు భావిస్తున్నారు. దీంతో తక్షణం సహాయక చర్యలు చేపట్టిన ఈయూ నావల్ అధికారులు వారిలో కొంతమందిని కాపాడారు.
దీనిపై స్పందించిన నావల్ అధికారులు యూరప్ కు 35 నాటికల్ మైళ్ల దూరంలో పడవ మునిగిపోతున్నట్లు గమనించామని, వెంటనే సహాయక చర్యలు చేపట్టి కొంతమందిని రక్షించినట్లు తెలిపారు. లైఫ్ బోట్లు, జాకెట్లతో అక్కడికి చేరుకునే లోపు కొంతమంది మరణించినట్లు వివరించారు. ప్రస్తుతం సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వలసదారులు లిబియా నుంచి ఇటలీకి తరలివస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 40,000 కు పైగా శరణార్థులు దక్షిణ యూరప్ కు వలస వెళ్లారు. వీరిని కూడా ఆ జాబితాలో చేరుస్తామని అధికారులు పేర్కొన్నారు.