'సొంతిట్లోనే బందీలయ్యాం.. కాపాడండి'
విస్కాన్సిన్: అమెరికాలోని అత్యవసర సర్వీసు 911కు విస్కాన్సి్న్ కు చెందిన దంపతులు ఫోన్ చేశారు. తాము బంధించబడ్డామని, వెంటనే వచ్చి తమను విడిపించాలని దీనంగా అభ్యర్థించారు. వారిని బంధించింది మనిషులు కాదు పిల్లి అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. జూన్ 17న ఈ ఫోన్ కాల్ వచ్చింది.
'మాకు ఒక పిల్లి ఉంది. దాని ప్రవర్తన వింతగా మారింది. నా భర్తపై దాడి చేసింది. మా సొంత ఇంటిలోనే బందీలుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో అత్యవసర సర్వీసుకు ఫోన్ చేస్తున్నాం. పిల్లి బారి నుంచి తప్పించి మమ్మల్ని కాపాడండి' అని బాధితురాలు 911కు ఫోన్ చేశారు.
వెంటనే స్పందించిన మిల్వాకీ ఏరియా డొమెస్టిక్ యానిమల్ కంట్రోల్ కమిషన్(ఎంఏడీఏసీసీ) దంపతులిద్దరినీ కాపాడింది. పిల్లి దాడిలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదని స్థానిక మీడియా తెలిపింది.దంపతులను హడలగొట్టిన పిల్లిని దూరంగా తీసుకెళ్లి వదిలేశారు. 2014లో ఓర్లాండోలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తమ 7 నెలల చిన్నారిపై పిల్లి దాడి చేసిందని, తమను కాపాడాలంటూ ఓ తండ్రి 911కు ఫోన్ చేశాడు.