అమెరికా కోర్టులో సహారా గ్రూప్కు ఊరట
న్యూయార్క్: చైర్మన్ సుబ్రతా రాయ్ బెయిల్‌కి నిధులు సమీకరించడంలో తలమునకలైన సహారా గ్రూప్‌కి అమెరికా కోర్టులో ఊరట లభించింది. అమెరికాలో అమ్మకానికి పెట్టిన సహారా గ్రూప్ రెండు హోటల్స్‌ను తమకు స్వాధీనం చేయాలంటూ తాజాగా హాంకాంగ్‌కి చెందిన జేటీఎస్ ట్రేడింగ్ అమెరికా కోర్టులో దావా వేసిన విషయం తెలిసిందే. న్యూయార్క్‌లోని రెండు హోటల్స్‌తో పాటు లండన్‌లోని గ్రాస్‌వీనర్ హోటల్ రీఫైనాన్సింగ్‌కి డీల్ కుదర్చాల్సిన టీమ్‌లో దుబాయ్‌కి చెందిన ట్రినిటీ వైట్ సిటీ వెంచర్స్‌తో తాము జతకట్టినట్లు జేటీఎస్ పేర్కొంది.
అయితే, సహారా గ్రూప్, ట్రినిటీ, స్విస్ బ్యాంక్ యూబీఎస్ కలిసి మధ్యలోనే తమ సంస్థను పక్కన పెట్టేశాయని, దీనివల్ల తమకు భారీగా నష్టం జరిగిందని తెలియజేసింది. ఇందుకు పరిహారంగా మూడు సంస్థలూ కలిసి 350 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ జేటీఎస్ దావా వేసింది. మరోవైపు, ట్రినిటీ వైట్ సిటీకి జేటీఎస్‌కి మధ్య లావాదేవీల విషయం తమకు తెలియదని, తమకి ఏమాత్రం సంబంధం లేని కేసులోకి అన వసరంగా లాగుతున్నారని సహారా గ్రూప్ తెలిపింది. దీనిపై విచారించిన అమెరికా ఉన్నత న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం.. హాంకాంగ్కి చెందిన జేటీఎస్ ట్రేడింగ్ వేసిన దావాను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.