
అదే హిల్లరీ కొంప ముంచిందా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ ఓటమి దాదాపు ఖరారయింది. డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధంలో అడుగు పెట్టడానికి చేరువయ్యారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ సాగించిన ఎన్నికల ప్రచారంపై చర్చ జరుగుతోంది. హిల్లరీ, ట్రంప్ హోరాహోరీగా ప్రచారం సాగించారు.
తన ప్రచారంలో హిల్లరీ 85 నినాదాలు వినిపించారు. దీనికి భిన్నంగా ట్రంప్ కేవలం ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే ఒకే ఒక్క స్లోగన్ తో ప్రచారం చేశారు. తనపై ఎన్ని వ్యక్తిగత ఆరోపణలు వచ్చినా ట్రంప్ జాతీయ భావాన్నిమాత్రమే తన ప్రచారంలో వినిపించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా తనకే ఉందని అమెరికన్లను ఒప్పించగలిగారు. హిల్లరీ మాత్రం అనేక అంశాలను స్పృశించారు. ఏ విషయంలోనూ కచ్చితమైన భరోసా ఇవ్వలేకపోయారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై గట్టిగా గళం వినిపించలేకపోయారు.
మరోవైపు డిగ్రీలు లేని శ్వేత జాతీయులు గంపగుత్తగా ట్రంప్ వైపు మొగ్గుచూపడం ఆయనకు కలిసొచ్చింది. నిరుద్యోగులు, నిరాక్షరాస్యులు కూడా ఆయనకు మద్దతుగా నిలిచినట్టు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే బాగా చదువుకున్నవాళ్లంతా ఓటింగ్ లో పాల్గొనాలని అధ్యక్షుడు బరాక్ ఒబామా పోలింగ్ కు కొద్దిరోజుల ముందు పిలుపునిచ్చారు. ఎక్కువ మంది ఓటింగ్ లో పాల్గొనేలా చూడాలని డెమోక్రాటిక్ పార్టీ మద్దతుదారులకు పిలుపునిచ్చారు.