పాశ్చాత్యుల్ని వీడని రంగు జబ్బు
చర్మం రంగు కారణంగా భారత మూలాలున్న బ్రిటన్ వ్యక్తిని నిర్బంధించిన అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు
లండన్: శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంగా వస్తున్న మార్పులతో ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయినా పాశ్చాత్యుల్లో గూడు కట్టుకున్న వర్ణ వివక్ష మాత్రం ఇంకా తుడిచి పెట్టుకుపోలేదు. తాజాగా భారత సంతతికి చెందిన బ్రిటన్ వ్యక్తికి అమెరికాలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.
చర్మం రంగు కారణంగా అమ్రీత్ సురానా అనే వ్యక్తిని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు 13 గంటల పాటు నిర్బంధించి అనంతరం తిప్పి పంపేశారు. యూకే సెక్యూరిటీ కంపెనీలో ఇంటర్నేషనల్ మేనేజర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల సురానా అరిజోనాలోని బ్రాంచ్ పరిశీలన నిమిత్తం లండన్ నుంచి అమెరికా వచ్చారు. డెట్రాయిట్‌లో దిగి కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వేచి చూస్తున్న సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు.
‘అమెరికాలో వీసా లేకుండా ప్రయాణించడానికి అనుమతించిన 38 దేశాల్లో ఒక దేశానికి చెందిన వ్యక్తినని ఆధారాలు చూపినా నా చర్మం రంగు కారణంగా వారు దాన్ని నమ్మలేదు’ అని సురానా పేర్కొన్నారు. సురానాను తిప్పి పంపడంపై యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటక్షన్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. 20 నిమిషాల వ్యవధిలోనే వారు నన్ను అమెరికాలో ఉద్యోగం కోసం వచ్చిన అక్రమ వలసదారుగా నిర్ధారించారని సురానా వాపోయారు.