బిన్‌ లాడెన్‌ కొడుకు హంజా మృతి! | US Media Report Says Osama bin Laden Son Hamza Is Dead | Sakshi
Sakshi News home page

లాడెన్‌ వారసుడు హంజా మృతి!

Published Thu, Aug 1 2019 8:17 AM | Last Updated on Thu, Aug 1 2019 8:24 AM

US Media Report Says Osama bin Laden Son Hamza Is Dead - Sakshi

వాషింగ్టన్‌ :  అంతర్జాతీయ ఉగ్రవాది, ఆల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ కొడుకు హంజా బిన్‌ లాడెన్‌ హతమైనట్లు అమెరికాకు చెందిన ఎన్‌బీసీ న్యూస్‌ సంచలన వార్త వెలువరించింది.  హంజా మృతి చెందాడని అమెరికా ఇంటలెజిన్స్‌ అధికారులు తెలిపినట్లు సదరు ఛానల్‌ పేర్కొంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గానీ, శ్వేతసౌధ వర్గాలు గానీ హంజా మరణాన్ని ధ్రువీకరించలేదు. కాగా పాకిస్తాన్‌లోని అబోతాబాద్‌లో తలదాచుకున్న బిన్‌ లాడెన్‌ను 2011లో అమెరికా సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఒసామా 20 మంది పిల్లల్లో 15వ వాడైన హంజా ఆల్‌ఖైదా నాయకత్వానికి వారసుడిగా ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి.  తండ్రి బిన్‌ లాడెన్‌ మరణానంతరం అల్‌ఖైదాలో హంజాకు సీనియర్‌ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సన్నద్ధమవుతున్నట్లు పలు రిపోర్టులు నివేదించాయి. దీంతో అతడి కోసం అమెరికా గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. అయితే జిహాద్‌ రాజకుమారుడిగా చెప్పుకునే 29 ఏళ్ల హంజా జాడ కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత అతడు పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడని, అనంతరం అఫ్గనిస్తాన్‌, సిరియాల్లో ఉన్నాడని ప్రచారం జరిగింది.

ఈ క్రమంలో హంజాను ఇరాన్‌ గృహ నిర్బంధంలో ఉంచిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని సిరియాలో నరమేధం సృష్టించిన ఐసిస్‌ తరహాలో అటు బిన్‌ లాడెన్‌ హత్యపై ప్రతీకారం.. ఇటు జిహాద్‌ విస్తరణకు హంజా సన్నద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో హంజా ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్‌ డాలర్లు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారిక ప్రకటన తర్వాతే హంజా మరణవార్త నిజమా కాదా అన్న అనుమానాలు తేటతెల్లమవనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement