వాషింగ్టన్: అమెరికాలోని నాష్ విల్లే అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం హ్యూస్టన్ నుండి 133 మంది ప్రయాణికులతో వచ్చిన సౌత్వెస్ట్ విమాన సంస్థకు చెందిన బోయింగ్ విమానం ఒకటి ప్రమాదవశాత్తు రన్ వే నుండి జారిపోయింది. రన్ వే మీద ల్యాండ్ అయిన విమానం దారి తప్పి టాక్సీ వే లోకి దూసుకెళ్లింది. అంతటితో ఆగకుండా ముందున్న గడ్డిలోకి జారుతూ వెళ్లి ఆగింది.
ఈ ఘటనలో 8 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని ఎయిర్ పోర్ట్ అధికారులు సమీపంలోని అసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పెద్ద శబ్దంతో రన్వే నుండి విమానం జారి పోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.