కడుపులోకి బుల్లెట్లు.. ఎముకలు ధ్వంసం
వాషింగ్టన్: వర్జీనియాలోని అలెగ్జాండ్రియా బేస్ బాల్ మైదానంలో కాల్పులకు గురై ప్రస్తుతం చికిత్స పొందుతున్న రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేత లూసియానా ఎంపీ స్టీవ్ స్కేలీస్‌ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలనియా ట్రంప్ పరామర్శించారు. పుష్పగుచ్ఛంతో వాషింగ్టన్‌లోని ఆస్పత్రికి వచ్చిన వారు స్టీవ్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. స్టీవ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనగానే ఉందని, ఆయనకు మరిన్ని శస్త్ర చికిత్సలు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పారు.
ఎలాంటి విద్వేషాలు వద్దని, అందరం ఒకటేనని, కలిసి కట్టుగా ఐకమత్యంతో ముందుకు సాగాలని అభిలషించారు. విద్వేషపూరిత దాడులకు తాను వ్యతిరేకం అని ట్రంప్ అన్నారు. ఆస్పత్రి వైద్యులు వివరణ ఇస్తూ బుల్లెట్లు స్టీవ్ పొత్తికడుపులోకి, తుంటిలోకి దూసుకెళ్లడంతోపాటు ఎముకలను కూడా ధ్వంసం చేశాయని, ముఖ్యమైన అవయవాలు దెబ్బతిన్నాయని, రక్తస్రావం జరగుతోందని మరిన్ని ఆపరేషన్లు చేయనున్నామని చెప్పారు.
రిపబ్లికన్ సభ్యులు బేస్‌బాల్ సాధన చేస్తున్న సమయంలో జేమ్స్ జే హాడ్గికిన్సన్ అనే బెల్లివిల్లేకు చెందిన సాయుధుడు కాల్పులకు పాల్పడటంతో ఐదుగురికి గాయాలయ్యాయి. వర్జీనియాలోని అలెగ్జాండ్రియా బేస్‌బాల్ మైదానంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో పార్టీ అగ్ర నాయకుడు, లూసియానా ఎంపీ స్టీవ్ స్కేలీస్‌తో పాటు మరో ఎంపీ రోజర్ విలియమ్స్ ఉన్నారు. గురువారం రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం సాధన చేస్తుండగా 50 ఏళ్లకు పైగా ఉన్న జేమ్స్ మైదానంలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. అతడికి రిపబ్లికన్లంటే ఎక్కడలేని కోపమట.