
వాషింగ్టన్: గల్ఫ్ ప్రాంతంలో ప్రయాణించే చమురు ఓడల రక్షణ బాధ్యత ఆయా దేశాలే చూసుకోవాలని, ప్రమాదకరమైన ఆ ప్రాంతంపై తమకు అంతగా ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. గల్ఫ్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ట్రంప్ సోమవారం ట్వీట్‌చేశారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేకుండా చూడటం, ఉగ్రవాదాన్ని ఆ దేశం ప్రోత్సహించకుండా చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామంటున్న ఇరాన్ బెదిరింపులపై ఆయన.. ‘మా వద్ద చాలినన్ని చమురు నిల్వలున్నాయి. ఆ ప్రాంతంతో మాకు అవసరం లేదు. అక్కడ మేం రక్షణ బాధ్యతలు చేపట్టడం లేదు. గల్ఫ్‌లో ప్రయాణించే చమురు నౌకల భద్రత బాధ్యత సంబంధిత దేశాలదే’ అని పేర్కొన్నారు. ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు వీలు కల్పించే ఉత్తర్వుపై ట్రంప్ సోమవారం సంతకం చేశారు. దీని ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ, ఇతర ఉన్నతాధికారుల ఆర్థిక లావాదేవీలను అమెరికా నిరోధించనుంది.
మోదీ, పుతిన్‌లతో భేటీ కానున్న జిన్‌పింగ్
బీజింగ్: జి–20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో చైనా అధినేత జిన్‌పింగ్ భేటీ కానున్నారు. ఈ నెల 28, 29వ తేదీల్లో జపాన్‌లోని ఒసాకాలో జి–20 దేశాల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దిగుమతులపై భారీగా పన్నులు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న ఏకపక్ష, రక్షణాత్మక విధానాలపై ఈ సందర్భంగా వీరు ప్రముఖంగా చర్చించనున్నారని చైనా అధికారులు తెలిపారు. భారత్, రష్యాలతోపాటు బ్రిక్స్‌లోని ఇతర సభ్య దేశాలు బ్రెజిల్, దక్షిణాఫ్రికాలతోనూ జిన్‌పింగ్ చర్చలు జరుపుతారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment