ఉగ్రవాదంపై చర్యలు తీసుకోండి
న్యూయార్క్: పాకిస్తాన్‌ను అడ్డాగా మార్చుకున్న ఉగ్రవాదులకు అడ్డుకట్ట వేయాల్సిందేనని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తేల్చిచెప్పారు. కశ్మీర్‌లో హింస, భారత సైనిక స్థావరంపై ఉగ్ర దాడుల నేపథ్యంలో ఆయనీమేరకు స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య భేటీ కోసం ఇక్కడికి వచ్చిన షరీఫ్ సోమవారం కెర్రీని కలిశారు. కశ్మీర్‌లో మారణహోమం, మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని... ఈ సమస్య పరిష్కారానికి అమెరికా సహకారం అవసరమని షరీఫ్ తెలిపారు.
బ్రిటన్ ప్రధాని థెరిసా మేను కలిసిన సందర్భంలో కూడా షరీఫ్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి: యూరి సైనిక స్థావరంపై జరిగిన ఉగ్ర దాడిని అమెరికాలోని భారత సంతతి ప్రజలు ఖండించారు. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని అమెరికాను కోరారు.