సిరియాపై అమెరికా క్షిపణి దాడి | USA strikes syrian airbase with tomahak missiles | Sakshi
Sakshi News home page

సిరియాపై అమెరికా క్షిపణి దాడి

Published Sat, Apr 8 2017 1:50 AM | Last Updated on Fri, Aug 24 2018 9:27 PM

సిరియాపై అమెరికా క్షిపణి దాడి - Sakshi

సిరియాపై అమెరికా క్షిపణి దాడి

59 క్షిపణులతో షాయ్‌రత్‌ ఎయిర్‌బేస్‌ విధ్వంసం
నలుగురు చిన్నారులు సహా 9 మంది మృతి
‘రసాయనిక దాడి’కి ప్రతీకారంగానే


డమాస్కస్‌: మధ్య సిరియాలోని షాయ్‌రత్‌ వైమానిక స్థావరం చుట్టుపక్కల శుక్రవారం అమెరికా క్షిపణులతో దాడి చేసింది. ఇటీవల సిరియాలోని ఖాన్ షేఖున్ లో జరిగిన రసాయనిక దాడికి ఈ ఎయిర్‌బేస్‌ నుంచే కార్యాచరణ జరిగిందనే సమాచారంతో 59 తొమాహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులతో మెరుపు దాడి చేసింది. ఈ దాడుల్లో 9 మంది సిరియన్  పౌరులు మృతిచెందారు. ఇందులో నలుగురు చిన్నారులున్నారని సిరియా వార్తా సంస్థ సనా వెల్లడించింది.

‘అమెరికా షాయ్‌రత్‌ ఎయిర్‌బేస్‌ చుట్టుపక్కన ఉన్న అల్‌–హమ్‌రత్, అల్‌–మంజుల్‌ గ్రామాలపై క్షిపణులతో విరుచుకుపడింది. సిరియాలో ఐసిస్‌ ఉగ్రవాదులపై ఆరేళ్లుగా అమెరికా, రష్యా వేర్వేరు సంకీర్ణాలుగా పోరాటం చేస్తున్నాయి. మంగళవారం ఐసిస్‌ ఆధీనంలోని ఓ పట్టణంపై జరిగిన రసాయనిక దాడిలో వంద మందికి పైగా మరణించటం.. వందల సంఖ్యలో తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘రసాయనిక దాడి అనాగరికం’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన రెండ్రోజుల్లోనే క్షిపణి దాడి జరిగింది.

దాడి అనాలోచితం, బాధ్యతారాహిత్యం
తమ ఎయిర్‌బేస్‌పై అమెరికా క్షిపణి దాడి అనాలోచితం, బాధ్యతారాహిత్యమని సిరి యా అధ్యక్షుడు అసద్‌ తీవ్రంగా విమర్శిం చారు. ‘అమెరికా నేడు చేపట్టిన ఈ దాడులు అర్థరహితం. ఇది అమెరికా హ్రస్వదృష్టికి, గుడ్డి రాజకీయ, మిలటరీ విధానాలకు నిదర్శనం. సిరియా సార్వభౌమత్వం లక్ష్యంగా జరిగిన దురదృష్టకర ఘటనగా భావిస్తున్నాం’ అని అల్‌–అసద్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సిరియన్ మిలటరీ వద్ద ఎలాంటి రసాయనిక ఆయుధాల్లేవని స్పష్టం చేసింది.

స్వాగతించిన ప్రపంచ దేశాలు
సిరియా ఎయిర్‌బేస్‌పై అమెరికా దాడిని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. వంద మందిని పొట్టన పెట్టుకున్న రసాయనిక దాడికి ప్రతీకారంగానే క్షిపణి దాడి జరిగిందని, దీనికి తమ సంపూర్ణ మద్దతుంటుందని యూకే, ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా, టర్కీ తదితర దేశాలు ప్రకటించాయి. సిరియాలో శాంతి నెలకొనేందుకు అన్ని దేశాలూ సహకరించాలని.. సిరియా ప్రజలను మరిన్ని ఇబ్బందులకు గురిచేసే చర్యలను ఆపేయాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గ్యుటెరస్‌ కోరారు. దీనిపై భద్రతామండలి అత్యవసరంగా  సమావేశమైంది.

తొమాహాక్‌ మిసైల్‌ అంటే!
సిరియాపై దాడిలో 59 తొమాహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులు వినియోగించింది. 2వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయటంలో వీటిని  అమెరికా వాడింది. వెయ్యి పౌండ్ల బరువైన వార్‌హెడ్‌లను ఇది మోసుకెళ్లగలదు. 20 అడుగుల పొడుగుండే తొమాహాక్‌ గంటలకు 880 కిలోమీటర్ల వేగంతో దూసుపోతుంది. అయితే శుక్రవారం నాటి దాడుల్లో తొలిసారిగా నేవీ నౌకలనుంచి ఎయిర్‌బేస్‌పైకి దీన్ని వినియోగించారు.  

రష్యా, ఇరాన్ ఖండన
ఇది ఏకపక్ష నిర్ణయమని ఇరాన్, రష్యా విమర్శించాయి. ఈ దాడులు ‘సిరియా సార్వభౌమత్వానికి వ్యతిరేకం. అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన’ అని పేర్కొన్నాయి. భవిష్యత్తులో అమెరికా–రష్యా సంబంధాలను ఇది దెబ్బతీస్తుందని వెల్లడించింది. అమెరికా క్షిపణి దాడులపై చర్చించేందుకు అత్యవసరంగా భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చింది. అమెరికన్ క్షిపణి దాడుల్లో షాయ్‌రత్‌ ఎయిర్‌బేస్‌లోని 9 సిరియన్ విమానాలతోపాటుగా.. సమీపంలోని ఆయుధాగారం, ఇంధన డిపోలు పూర్తిగా ధ్వంసమయ్యాయని రష్యా టీవీ చానెల్‌ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement