భారతీయులకు ‘హార్వీ’ కష్టాలు
హూస్టన్: అమెరికాలో హార్వీ హరికేన్ ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలకు తోడు భారీ వరదలు టెక్సాస్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా టెక్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్‌లోకి వరద నీరు చొచ్చుకురావడంతో దాదాపు 200 మంది భారతీయ విద్యార్థులు క్యాంపస్‌లో చిక్కుకున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీటర్‌లో తెలిపారు. షాలిని, నిఖిల్ భాటియా అనే విద్యార్థులను ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పారు. అక్కడి భారత కాన్సుల్ జనరల్ అనుపమ్ రే సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
సహాయక చర్యలకు బోట్లు అవసరం కావడంతో, విద్యార్థులకు బోట్ల ద్వారా ఆహారం అందించాలన్న తమ ప్రతిపాదనను అమెరికా తీరరక్షక దళం తిరస్కరించిందన్నారు.మరోవైపు స్థానిక అధికారులు మాట్లాడుతూ వర్సిటీలో చిక్కుకున్న విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. స్థానిక భారతీయ అమెరికన్లు బాధితులకు ఆహారం, ఇతర వస్తువులు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. హార్వీ హరికేన్ ప్రభావంతో అతలాకుతలం అవుతున్న లూసియానా రాష్ట్రంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. హార్వీ ఉధృతికి ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న టెక్సాస్ రాష్ట్రాన్ని ట్రంప్ మంగళవారం సందర్శిస్తారని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి శాండర్స్ తెలిపారు.