బెస్ట్‌ జాబ్‌: ఏడాదికి 83 లక్షల జీతం! | Vidanta Offering 83 Lakh And Free Stay At A Luxury Resort In Mexico | Sakshi
Sakshi News home page

ఏడాదికి 83 లక్షల జీతం!

Published Tue, Aug 28 2018 7:22 PM | Last Updated on Tue, Aug 28 2018 7:22 PM

Vidanta Offering 83 Lakh And Free Stay At A Luxury Resort In Mexico - Sakshi

న్యూఢిల్లీ: మీకు ట్రావెలింగ్‌ అంటే ఇష్టమా? అన్ని దేశాలు తిరుగుతూ విభిన్న సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవాలని ఉందా? దేశ దేశాల రుచులు ఆస్వాదించాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం మెక్సికోలోని విదాంతా రిసార్ట్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. మీరు కన్న కలలన్నీ నెరవేరతాయి. ఇదేమీ సాదాసీదా ఉద్యోగం కాదు. ప్రపంచంలో దీనిని మించిన ఉద్యోగమే లేదట. విదాంతా గ్రూప్‌ ‘ప్రపంచంలో అత్యుత్తుమ ఉద్యోగం’ అంటూ జారీచేసిన ప్రకటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఈ ఉద్యోగం వస్తే ఏడాదికి 83 లక్షల రూపాయల వేతనం, బీచ్‌ అందాల్ని ఆస్వాదించేలా రిసార్టుల్లో ఉచిత బస, దేశదేశాలు తిరిగే ఛాన్స్‌ వస్తుంది. ఇక విందు వినోదాలకు కొదవే లేదు. పైసా ఖర్చు లేకుండా ప్రపంచ ప్రసిద్ధ చెఫ్‌లు చేసిపెట్టిన వంటకాల్ని లొట్టలేసుకుంటూ తినొచ్చు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలను సందర్శించవచ్చు. సాహసం చేసే స్వభావం ఉంటే కీకారణ్యాల్లో షికారు కొడుతూ వేటాడే సరదా తీర్చుకోవచ్చు. అంతేనా మంచం మీద నుంచి కాలు కింద పెట్టకుండానే బెడ్‌ కాఫీ, బ్రేక్‌ ఫాస్ట్‌.. వంటికి మసాజ్‌ల కోసం సకల సౌకర్యాలతో ఉండే స్పాలు, సాయంత్రం వేళల్లో సరస్సుల పక్కన విహారం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కంపెనీ ఇచ్చే ప్రోత్సాహకాల జాబితా చాంతాండంత అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు.

అవనిలో ఉన్న అంతులేని ఆనందం అంతా ఈ ఒక్క ఉద్యోగంతో మీ సొంతమవుతుందని విదాంతా గ్రూప్‌ ఎగ్జిక్యూటిక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఇవాన్‌ చావెజ్‌ అంటున్నారు. ఇన్ని రాజభోగాలు సమకూరుస్తున్నారంటే ఉద్యోగానికి అర్హతలేంటని అనుకుంటున్నారా? ఏం పెద్దగా అక్కర్లేదు. సోషల్‌ మీడియాలో మీకు నేమ్, ఫేమ్‌ ఉండాలి. పర్యాటకుల్ని ఆకర్షించే నైపుణ్యం మీ సొంతమైతే చాలు. ఒక బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఆ రిసార్టుల బిజినెస్‌ పెంచే బాధ్యత మీదే. ఈ ఉద్యోగానికి మీరు అర్హులే అనుకుంటే www.worldsbestjob.com వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవండి. అక్టోబర్‌ 21లోగా ఈ కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement