అమెరికాలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
లాస్ ఏంజెలెస్:
బంగారు తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అభినందనీయమని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో సాగు, తాగునీటి సమస్యలు శాశ్వతంగా తొలగిపోతాయని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాస్ ఏంజెలెస్ తెరాస కార్యకర్తలను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తర అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్-యూఎస్ఏ అద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గీతాన్నిఆలపించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమరవీరులను స్మరించుకుని రెండు నిమిషాలు మౌనం పాటించి తెలంగాణ సిద్ధాంతకర్త, స్వర్గీయ జయశంకర్ గారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని రమేష్ గట్టు, హరిందర్ తాళ్లపల్లి నిర్వహించారు.
పాలేరు ఉప ఎన్నిక నల్లేరుపై నడకని, తెరాస విజయం తథ్యమని కేసీఆర్ గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా రాష్ట్ర ప్రజల కోసం వాటర్ గ్రిడ్, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, స్వచ్చ హైదరాబాద్, మహిళల రక్షణకు షీ టీమ్స్, ఇంకుడు గుంతలు లాంటి కార్యక్రమాల్ని చేపట్టారని గొంగిడి సునీత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యాపారాన్ని, అవినీతిని అరికట్టడానికి చేపట్టిన చర్యలను పలువురు ఎన్నారైలు అభినందించారు. ఈ కార్యక్రమానికి సుమారు 200 మందికి పైగా కార్యకర్తలు హజరయ్యారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్-యూఎస్ఏ నాయకులు విజయ్ రెడ్డి తుపల్లి, యుగంధర్ రెడ్డి మోతే, సురేశ్ రెడ్డి, చంద్ర వలబోజు, రవి ధరనిపతి, విజయ్ కసనగొట్టు, ప్రవీణ్ ఎర్రమాడ, ప్రహ్లాద్ ఇనగంటి, కిరణ్ బొడ్ల తదితరులు పాల్గొన్నారు.