విజయ్ మాల్యా అరెస్ట్
► లండన్‌లో అదుపులోకి తీసుకున్న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు
► అరెస్టయిన మూడు గంటల్లోపే బెయిల్‌పై బయటకు..
► మాల్యాపై నేరస్తుల అప్పగింత ప్రక్రియలో తొలి అడుగు
► మాల్యాను రప్పించడం అంత సులువేం కాదు: నిపుణులు
► దోచుకున్న సొమ్మును ఇవ్వాల్సిందేనంటూ ప్రధాని మోదీ ట్వీట్
వేలకోట్లు ఎగవేసి, బ్రిటన్‌లో విలాస జీవితం అనుభవిస్తున్న కింగ్‌ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యాను భారత్ రప్పించే ప్రక్రియలో ఎట్టకేలకు తొలి అడుగు పడింది. అతన్ని అప్పగించాలన్న భారత్ ఒత్తిడి మేరకు లండన్‌లో మాల్యాను అరెస్టు చేశారు. నేరస్తుల అప్పగింతలో విచారణలో భాగంగా స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మంగళవారం ఉదయం మాల్యాను అదుపులోకి తీసుకుని.. అనంతరం సెంట్రల్ లండన్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఒకవైపు వార్తాచానళ్లలో మాల్యా అరెస్టు వార్తలు ప్రసారం అవుతుండగానే.. వెస్ట్‌మినిస్టర్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.
ఒకప్పుడు రాజభోగాలు, విలాసాల్లో మునిగితేలిన ఈ రుణ ఎగవేతదారుడు కేవలం మూడు గంటల్లోనే బెయిల్‌పై బయటికి వచ్చారు. వెంటనే ట్వీటర్‌లో స్పందిస్తూ ‘ఎప్పటిలానే భారతీయ మీడియా హడావుడి చేసింది. అనుకున్న ప్రకారమే నేరస్తుల అప్పగింతపై విచారణను కోర్టు ప్రారంభించింది’అని ట్వీట్ చేశారు. మే 17న మాల్యా మళ్లీ లండన్ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. నేరస్తుల అప్పగింతపై భారత్ అందచేసిన ఆధారాల్ని పరిశీలించాక కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఈ కేసులో న్యాయ పోరాటం కొనసాగిస్తానని మాల్యా స్పష్టం చేశారు. కాగా విజయ్ మాల్యాను భారత్‌కు తీసుకురావడం అంత సులువేం కాదని విదేశాంగ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు.
భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు మాల్యాను అరెస్టు చేశామని సీబీఐ అధికారులకు లండన్ పోలీసులు సమాచారం అందించారు. అనంతరం స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు స్పందిస్తూ.. ‘మెట్రోపాలిటన్ పోలీసు విభాగానికి చెందిన నేరస్తుల అప్పగింత విభాగం మాల్యాను అరెస్టు చేసింది. మోసం ఆరోపణలకు సంబంధించి భారతీయ అధికారుల తరఫున విజయ్ మాల్యాను అరెస్టు చేశాం’ అని చెప్పారు. సెంట్రల్ లండన్ పోలీసు స్టేషన్‌కు మాల్యాను తీసుకెళ్లాకే అరెస్టు చేశామని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు.
అనంతరం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో కనిపించిన మాల్యా... వెంటనే బెయిల్ దొరకడంతో న్యాయవాదుల బృందంతో కోర్టు నుంచి బయటకు వచ్చారు. ‘ఇది కేవలం స్వచ్ఛందంగా చోటుచేసుకున్న పరిణామం. కొద్ది నిమిషాల్లోనే మాల్యా బయటకొచ్చారు’అని ఆయన తరఫు న్యాయవాది ఒకరు పేర్కొన్నారు. మరోవైపు త్వరలో బ్రిటన్ పర్యటన సందర్భంగా మాల్యా అప్పగింతపై చర్చించవచ్చని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన నేపథ్యంలో ఈ అరెస్టు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత నెల్లో భారత్ విజ్ఞప్తిని ధ్రువీకరించిన బ్రిటన్
భారత్, బ్రిటన్ మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు మాల్యాను అప్పగించాలంటూ ఫిబ్రవరి 8న అధికారికంగా భారత్ విజ్ఞప్తి చేసింది. మాల్యాపై చట్టప్రకారం కేసులు ఉన్నాయని, తమ విజ్ఞప్తిని అంగీకరిస్తే.. భారత ఆందోళన పట్ల బ్రిటన్ సానుకూల ప్రతిస్పందనగా భావిస్తామని అందులో పేర్కొంది. గత నెల్లో బ్రిటన్ ప్రభుత్వం భారత విజ్ఞప్తిని ధ్రువీకరించడంతో పాటు తదుపరి చర్యలు చేపట్టాలంటూ దానిని జిల్లా జడ్డికి పంపారు. దాంతో మాల్యా అరెస్టుకు కోర్టు వారెంట్ జారీచేవడంతో బ్రిటన్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
మాల్యాను రప్పించడం సుధీర్ఘ ప్రక్రియే..
మాల్యాను భారత్ రప్పించడం అంత సులువైన ప్రక్రియ కాదని, సుధీర్ఘ సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. భారత్, బ్రిటన్‌ల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉన్నా అది టైప్–బీ కేటగిరి కిందకు వస్తుంది. టైప్–ఏలో అమెరికా, పలు యూరప్ దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు ఉన్నాయి. ఈ దేశాలతో నేరస్తుల అప్పంగిత ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది.
టైప్–2 దేశాలతో మాత్రం నేరస్తుల అప్పగింతపై బ్రిటన్ ఆచీతూచి వ్యవహరించడంతో పాటు జాప్యం చేస్తోంది. బ్రిటన్‌లో తలదాచుకుంటున్న అనేకమంది నేరస్తుల్ని అప్పగించాలన్న భారత్ విజ్ఞప్తుల్ని పలుమార్లు ఆ దేశం తోసిపుచ్చింది. గత ఐదేళ్లలో గుజరాత్ అల్లర్ల నిందితుడు సమీర్‌భాయ్ పటేల్‌ను మాత్రమే అప్పగించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఇటీవల చెప్పారు. ఇప్పుడు మాల్యాను అప్పగిస్తే మిగతా నేరస్తుల్ని కూడా అప్పగించాల్సి రావచ్చన్న ఆందోళన నేపథ్యంలో మాల్యా విషయంలో బ్రిటన్ జాప్యం చేయవచ్చని భావిస్తున్నారు.
అంతిమ నిర్ణయం బ్రిటన్ సుప్రీంకోర్టుదే
కేటగిరి–బి దేశాలకు నేరస్తుల అప్పగించాలంటే సుధీర్ఘ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. ముందుగా నేరస్తుల అప్పగింతపై బ్రిటన్ విదేశాంగ శాఖకు అధికారికంగా విజ్ఞప్తి చేయాలి. ఈ అభ్యర్థనను అంగీకరించాలో.. వద్దో? విదేశాంగ శాఖ నిర్ణయిస్తుంది. అనంతరం ఈ అంశాన్ని జిల్లా కోర్టుకు సిఫార్సు చేస్తారు. నేరస్తుడిగా పేర్కొన్న వ్యక్తిపై అరెస్టు వారంట్ జారీ చేయాలా? వద్దా? అనేది జిల్లా జడ్డి నిర్ణయిస్తారు. వారెంట్ జారీ చేస్తే... అతన్ని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరుస్తారు. మొదట ప్రాధమిక విచారణ, అనంతరం నేరస్తుల అప్పగింతపై విచారణ నిర్వహిస్తారు. అనంతరం నేరస్తుడ్ని అప్పగించాలా? వద్దా? అన్న అంశాన్ని విదేశాంగ శాఖ నిర్ణయిస్తుంది. నేరస్తుల్ని అప్పగించమని కోరుతున్న దేశాలు క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్)కు మరోసారి విజ్ఞప్తిని సమర్పించాలని బ్రిటన్ విదేశాంగ శాఖ సూచిస్తుంది. అనంతరం అప్పగింత ప్రక్రియ మొదలవుతుంది. అయితే తీర్పుపై ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీలుకు వెళ్లవచ్చు. బ్రిటన్ సుప్రీంకోర్టు నిర్ణయమే అంతిమం.
సాధ్యాసాధ్యాల్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: కేంద్ర ప్రభుత్వం
అరెస్టుపైకేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ మాట్లాడుతూ.. మాల్యాను భారత్‌కు రప్పించడం, న్యాయ విచారణ ప్రారంభించడంపై సాధ్యాసాధ్యాల్ని అంచనావేస్తున్నామని చెప్పారు. ఆర్థిక నేరాలకు పాల్పడినవారు ఎవరైనా సరే చట్టం ముందుకు నిలబెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బ్రిటన్ నుంచి ఇతర నేరస్తుల్ని రప్పించే ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు మాల్యా అప్పగింతపై బ్రిటన్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. న్యాయపరంగా అన్ని ప్రక్రియలు కొనసాగుతాయని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే అన్నారు. మాల్యా అరెస్టు దర్యాప్తు సంస్థలు సాధించిన విజయంగా సీబీఐ మాజీ డైరక్టర్ అనిల్ సిన్హా అభివర్ణించారు.
మాల్యాను భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ విజయవంతం అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఆర్థిక నేరగాళ్లపై మోదీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే విషయాన్ని ఈ అరెస్టు రుజువు చేసిందని బీజేపీ పేర్కొంది. అలాంటి వారితో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనేందుకు ఇదే నిదర్శమని బీజేపీ ప్రతినిధి నలిన్ కోహ్లీ అన్నారు. మాల్యా అరెస్టుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తప్పుదారి పట్టిస్తున్నారని, మాల్యాను కస్టడీలోకి తీసుకుని ఎప్పటిలోగా రుణాలు రాబడతారో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మాల్యాను బహిష్కరించమని కోరకుండా, అప్పగింతకు మోదీ ప్రభుత్వం ఎందుకు పట్టుబడుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ప్రశ్నించారు. మాల్యాను అదుపులోకి తీసుకుని వెంటనే విడుదల చేశారని, ఇది ఏరకమైన నేరస్తుల అప్పగింత ప్రక్రియని ఆయన ప్రశ్నించారు.
దోచుకున్న సొమ్మును ఇవ్వాల్సిందే: ప్రధాని
న్యూఢిల్లీ: ‘పేదలు, మధ్య తరగతి ప్రజల్ని దోచుకుని సంపాదించిన సొమ్మును ఆ వ్యక్తులు తిరిగి ఇవ్వాల్సిందే. దేశంలో అవినీ తికి చోటులేదు’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మాల్యా అరెస్టు నేపథ్యంలో ఈ ట్వీ ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. కష్టించి సంపాదించిన ధనాన్నే కాకుండా గౌరవాన్ని కూడా అవినీతి దోచుకుంటుందన్న ట్వీట్‌కు స్పందిస్తూ ప్రధాని రీట్వీట్ చేశారు.