ట్రంప్ ర్యాలీలో హింస
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ర్యాలీలో హింస చెలరేగింది. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, ప్రచారంలో దూసుకుపోతున్న ట్రంప్ గురువారం రాత్రి కాలిఫోర్నియాలోని ఓసీ ఫెయిర్, ఈవెంట్ సెంటర్లో పాల్గొన్న ఎన్నిక ప్రచారసభలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రంప్ మద్దతుదారులు, వ్యతిరేకులు ఘర్షణపడ్డారు.
ట్రంప్ సభకు వేలాదిమంది మద్దతుదారులు హాజరుకాగా.. వేదిక వెలుపల వీధుల్లో ఆయన వ్యతిరేకులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ట్రంప్ మద్దతుదారులకు, నిరసన కారులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు రోడ్లను, ట్రాఫిక్ను బ్లాక్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. నిరసన కారుల దాడిలో ఓ పోలీసు వాహనం ధ్వంసమైంది. పోలీసులు 20 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. వలసలు, మెక్సికన్లకు వ్యతిరేకంగా ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై వారు నిరసన తెలిపారు.