
సీసీ టీవీ దృశ్యం, (ఇన్‌సెట్‌లో) కాపాడిన పిల్లి
కొలంబియా : ఎక్కువగా అందరూ పెంచుకునే పెంపుడు జంతువు శునకం. విశ్వాసానికి, దర్పానికి మారుపేరు అంటూ కుక్కను పెంచుకునేవారు బోలెడుమందే ఉంటారు. దీని తర్వాతి స్థానంలో ఉండేది పిల్లి. కుక్క అంత కాకపోయినా పిల్లిని ప్రాణంగా పెంచుకునేవారూ ఉన్నారు. అయితే చాలామందికి పిల్లి అంటే గిట్టదు. దాన్నో అపశకునంగా భావిస్తారు. పిల్లులు పైకి ఏమీ తెలీనట్టు కనిపించే మహా ముదుర్లు అనేవారూ లేకపోలేరు. ఇక రాత్రిళ్లు దాని కళ్లు చూసి భయపడేవారు లేకపోలేదు. ఇంతలా దాన్ని అగౌరవపరిచేవారు ఈ వార్త చదివితే తప్పకుండా పిల్లిని మెచ్చుకోకుండా ఉండలేరు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ ఇంట్లో ఎవరిపనుల్లో వారున్నారు. పసిబాలుడు ఆడుకుంటూ ఆడుకుంటూ గదంతా తిరుగుతున్నాడు. అక్కడే ఉన్న పిల్లి ఆ బుడ్డోడిని ఓ కంట కనిపెడుతూ ఉంది. ఇంతలో ఆ పిల్లవాడు మెట్లవైపుకు పాక్కుంటూ వెళ్లాడు. అది చూసిన పిల్లి మెరుపువేగంతో పిల్లోడి దగ్గరికి వెళ్లి మెట్లవైపుకు వెళ్లకుండా అడ్డుకుంది. పిల్లోడిని వెనక్కు తరిమి, ప్రమాదం నుంచి రక్షించింది. ఈ తతంగం అంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పిల్లే కనుక లేకుంటే ఎంత ప్రమాదం జరిగుండేదని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లులను అసహ్యించుకునే వారికి ఈ వీడియో చూపించండంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment