రష్యా అధ్యక్షుడిగా ప్రమాణంచేస్తున్న పుతిన్
మాస్కో: రష్యాపై సంపూర్ణమైన పట్టు పెంచుకున్న వ్లాదిమిర్ పుతిన్ (65) మరో ఆరేళ్లపాటు అధ్యక్షబాధ్యతల్లో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం నాలుగోసారి దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొన్నటి మార్చిలో రష్యాలో జరిగిన ఎన్నికల్లో పుతిన్‌కు 77 శాతం ఓట్లు వచ్చాయి.
దీంతో ఆయన 2024 వరకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించనున్నారు. దీటైన ప్రత్యర్థి, విపక్షనేత నావన్లీపై అవినీతి ఆరోపణలు మోపటం ద్వారా ఎన్నికల బరిలో దిగకుండా చేయటంతో.. పుతిన్ ఎన్నిక ఏకపక్షమైంది. 1999 నుంచి రష్యా రాజకీయాలను పుతిన్ నియంత్రిస్తున్నారు. జోసెఫ్ స్టాలిన్ తర్వాత ఎక్కువకాలం రష్యా అధ్యక్షుడిగా ఉన్న రికార్డును తనపేర రాసుకునే దిశగా దూసుకెళ్తున్నారు.
నా బాధ్యత పెరిగింది
దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజితం చేస్తానని ప్రమాణ స్వీకారం సందర్భంగా పుతిన్ పేర్కొన్నారు. ‘రష్యా వర్తమానం, భవిష్యత్తు కోసం ఏదైనా చేయటం నా బాధ్యత. నా జీవిత లక్ష్యం కూడా. నాపై నమ్మకంతో విజయాన్నందించిన రష్యన్లకు కృతజ్ఞతలు. దీంతో మన దేశ గౌరవం పెరిగింది. దేశాభివృద్ధిలో నా బాధ్యత మరింత పెరిగిందని బలంగా విశ్వసిస్తున్నాను. దేశాధ్యక్షుడిగా రష్యా కీర్తి, బలం, సుసంపన్నత రెట్టింపయ్యేలా చిత్తశుద్ధితో పనిచేస్తాను’ అని రష్యా రాజ్యాంగంపై పుతిన్ ప్రమాణం చేశారు. క్రెమ్లిన్ పాలెస్ కాంప్లెక్స్‌లోని ఆర్నెట్ ఆండ్రియేవ్ హాల్‌లో ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది.
విపక్షాల ఆందోళనలు
పుతిన్ విజయంపై విపక్ష నేత అలెక్సీ నావన్లీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో నావన్లీ సహా దేశవ్యాప్తంగా 1600 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులను యూరోపియన్ యూనియన్ తీవ్రంగా ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment