‘సుమితొమొ’తో 4 ఒప్పందాలు
జపాన్ కంపెనీలతో చంద్రబాబు మంతనాలు
⇒ విద్యుత్ ఉత్పత్తి, రాజధానిలో మౌలిక సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణ రంగాల్లో సుమిటోమీ సంస్థతో ఒప్పందాలు
⇒ యొకోహోమా పోర్టు సందర్శన..రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై అధ్యయనం
⇒ నేడు జపాన్ ప్రధానితో చంద్రబాబు భేటీ.. రేపు రాష్ట్రానికి తిరుగుముఖం
సాక్షి, హైదరాబాద్: జపాన్ దేశ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆ దేశానికి చెందిన ‘సుమితొమొ’తో సంస్థతో గురువారం నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి, కొత్త రాజధానిలో మౌలిక సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణ అంశాలపై ఈ ఒప్పందాలు జరిగాయి. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున మునిసిపల్, పరిశ్రమలు, ఇంధన శాఖల ముఖ్య కార్యదర్శులు, సుమితొమొ సంస్థ అధికారులు సంతకాలు చేశారు.
చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం గత నాలుగు రోజులుగా జపాన్‌లో పర్యటిస్తోంది. ఈ బృందం గురువారం నాడు సుమిటోమో సంస్థను సందర్శించినట్టు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం జిల్లా బారువలో 4,000 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం వల్ల రాష్ట్రం సంపూర్ణంగా మిగులు విద్యుత్ ఉండే రాష్ట్రంగా మారుతుందని.. ‘సుమితమొ’ సంస్థ సహకారంతో ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి జైకా, నెడో, జేబీఐసీ ఆర్థిక సాయం అందిస్తున్నాయని సీఎం అధికారిక ప్రకటనలో తెలిపారు. ‘కొత్త రాజధాని నగరంలో రవాణా, తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, గృహావసరాలకు సహజ వాయు సరఫరా తదితర సౌకర్యాల కల్పనకు ‘సుమితొమొ’ సహకరిస్తుంది.
చిన్న కమతాల సాగుకు పనికొచ్చే ఆధునిక యంత్రసామగ్రి సరఫరా, ఎరువులు, రసాయనాల వినియోగం, వ్యవసాయం యాంత్రీకరణ కేంద్రాల ఏర్పాటు, ఆధునిక సాగు విధానాలను అందించేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. తమ సంస్థకు ఏపీ కీలకమైన రాష్ట్రమని, విజ్జేశ్వరం పవర్ ప్లాంట్ ఏర్పాటులో భాగస్వామ్యం కూడా ఉందని ఆ సంస్థ చైర్మన్ కజువా ఓహ్‌మోరి చెప్పినట్లు ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణలో పేరెన్నికగన్న వరి ఉత్పత్తి కంపెనీ క్యుబోటో కార్పొరేషన్‌ను చంద్రబాబు బృందం సందర్శించింది. కంపెనీ డెరైక్టర్ యూచీ కిటావో తమ సంస్థ ఉత్పత్తుల గురించి వివరించారు. ఏపీలో ఆధునిక సాగు విధానాలు ప్రవేశపెట్టేందుకు, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు సహకరించాలని బాబు ఆ సంస్థను కోరారు.
యొకోహోమా పోర్టు సందర్శన..
జపాన్‌లో యొకోహోమా పోర్టును చంద్రబాబు బృందం సందర్శించింది. జపాన్లో తయారైన ఆటోమొబైల్ పరికరాలను ఈ పోర్టు నుంచే విదేశాలకు ఎగుమతి చేస్తారు. జపాన్‌లో అనుసరిస్తున్న పన్ను విధానం, ఓడరేవుల ద్వారా జరుగుతున్న ఎగుమతి, దిగుమతుల గురించి చంద్రబాబు బృందానికి టకాషీ వివరించారు. హుద్‌హుద్ తుపాను వల్ల తీవ్రంగా దెబ్బతిన్న విశాఖ పోర్టు కంటెయినర్ టెర్మినల్ పునర్నిర్మాణంపై అక్కడి అధికారులతో బాబు చర్చించారు.
జైకా ప్రతినిధులతో భేటీ
జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ప్రతినిధులతో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. భారతదేశంతో జపాన్ సంబంధాలు గతంలో భిన్నంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో మాత్రం ఉజ్వలంగా ఉంటాయన్నారు. తమది కొత్త రాష్ట్రమని, అందులో కొత్త రాజధాని నిర్మాణంతో పాటు పెట్టుబడులకు అనేక నూతన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ తయారీలో సహకరించాలని కోరారు. ఏపీలో ప్రత్యేకంగా జైకా కార్యాలయాన్ని నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జపనీస్ ఇండస్ట్రియల్ పార్కుకు ఒక స్పెషల్ అథారిటీని ఏర్పాటు చేస్తానని సీఎం తెలిపారు.
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో వాటర్ ట్రీట్‌మెంట్‌కు సహకరిస్తామని జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ (జేబీఐసీ) సీఈఓ వటానబే చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణంలో, ఎయిర్‌పోర్టులు, పోర్టుల అభివృద్ధిలో జపాన్ కంపెనీలు భాగస్వాములు కావటానికి కావల్సిన పరపతి సౌకర్యాలను కల్పించాలని ఆయనను చంద్రబాబు కోరారు. ఆయన శుక్రవారం నాడు జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో భేటీ కానున్నారు. శనివారం రాష్ట్రానికి తిరుగుప్రయాణం కానున్నారు.
ఈ పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పొంగూరి నారాయణ, ఎంపీలు గల్లా జయదేవ్, సి.ఎం.రమేష్, ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ప్రభుత్వ సలహాదారులు పరకాల ప్రభాకర్, లక్ష్మీనారాయణ, సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, సీనియనిర్ ఐఏఎస్ అధికారులు ఎస్.పి.టక్కర్, జె.ఎస్.పి.ప్రసాద్, ఇంటెలిజెన్స్ డీజీపీ అనురాధ ఉన్నారు.