Yokohama port
-
ఆ నౌకలోని మూడో ఇండియన్‌కు కోవిడ్-19
న్యూఢిలీ/టోక్యో : కోవిడ్-19 (కరోనా వైరస్) భయంతో జపాన్‌లోని యెకోహూమా తీరంలో నిలిపివేసిన ‘డైమండ్ ప్రిన్సెస్’ నౌకలోని భారతీయుల పరిస్థితి రోజురోజుకు ఆందోళకరంగా మారుతుంది. ఇక్పటికే ఆ నౌకలోని ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు టోక్యోలోని భారత ఎంబసీ ధ్రువీకరించింది. ప్రస్తుతం బాధితులతో టచ్‌లో ఉన్నామని భారత ఎంబసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స అందుతుందని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. ఆ నౌకలోని మొత్తం 3700 మందిలో 138 భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అందించిన సమాచారం ప్రకారం మొత్తంగా ఆ నౌకలోని 170 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ నౌకలోని భారతీయులు తమను కాపాడాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సాయం కోరుతూ పలువురు బాధితుల పంపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు ఆ నౌకలోని భారతీయులు పరిస్థితిపై స్వదేశంలోని వారి కుటుంబ సభ్యులు, బందువుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమవారిని క్షేమంగా తీసుకురావాలని వారు కూడా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి : ఒంటరిగా నిర్భంధించారు.. సాయం అందించండి కరోనా కాటేస్తోంది కాపాడరూ..! -
ఒంటరిగా నిర్భంధించారు.. సాయం అందించండి
న్యూఢిల్లీ/టోక్యో : కరోనా వైరస్ భయంతో ప్రయాణికుల నౌక ‘డైమండ్ ప్రిన్సెస్’ను కొద్ది రోజులుగా జపాన్‌లోని యెకోహోమా తీరంలోనే నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నౌకలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 175కు చేరింది. ఆ నౌకలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 3,700 మంది ఉండగా.. అందులో 138 మంది భారతీయులు ఉన్నారు. దీంతో వారి ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆ నౌకలో ఉన్న భారత్‌కు చెందిన సెక్యూరిటీ ఆఫీసర్ సోనాలి ఠాకూర్‌ను సోమవారం నుంచి ఒంటరిగా నిర్భందించారు. దీంతో తమకు సాయం చేయాల్సిందిగా సోనాలి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందడం మాలో భయాన్ని కలిగిస్తోంది. మాకు కూడా ఆ వైరస్ సోకుంతుందనే ఆందోళనలో ఉన్నాం. మేము కరోనా వైరస్ బారిన పడకుండా.. క్షేమంగా భారత్‌కు చేరుకోవాలని కోరుకుంటున్నామ’ని తెలిపారు. సోనాలి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నౌకలో కొత్తగా 39 మందికి కరోనా వైరస్ సోకింది. కేంద్ర ప్రభుత్వం మమల్ని భారత్‌కు తీసుకెళ్లి.. అక్కడ నిర్భంధించాలని కోరుతున్నాం. లేకపోతే కనీసం కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించడానికి.. మరికొంతమంది వైద్య సిబ్బందినైనా పంపండి. మేము క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నాం. నా పరిస్థితి గురించి ముంబైలోని కుటుంబసభ్యులు, స్నేహితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నేను క్షేమంగా తిరిగిరావాలని నిత్యం ప్రార్థనలు చేస్తున్నారు. నా తల్లిదండ్రులకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను.. ధైర్యంగా ఉండండి. మీ కుమార్తె త్వరలోనే క్షేమంగా ఇంటికి తిరిగివస్తుంద’ని అన్నారు. డైమండ్ ప్రిన్సెస్ నౌకలోని భారత ప్రయాణికులు ఇదివరకే తమకు సాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. పరిస్థితి ఇలాగే కొనసాగితే నౌకలోని మరింత మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని నార్త్ బెంగాల్‌కు చెందిన చెఫ్ బినయ్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఓ వీడియోను ఫేస్బుక్లో పెట్టారు. ‘మేం కోరుకుంటోంది ఒక్కటే, దయచేసి మమ్మల్ని ఈ నౌక నుంచీ, ఈ నిర్బంధం నుంచీ వేరు చేసి, ప్రత్యేకంగా ఉంచండి. మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. మాకు భయంగా ఉంది. దయచేసి సాయం చేయండి’అని అందులో బినయ్ విజ్ఞప్తి చేశారు. దీనిపై టోక్యోలోని భారత ఎంబసీ స్పందిస్తూ.. ఆ నౌకలోని భారతీయుల పరిస్థితిని నిరంతంరం సమీక్షిస్తున్నట్టు పేర్కొంది. చదవండి : కోవిడ్-19 : 18 నెలల్లో తొలి వ్యాక్సిన్ కోవిడ్-19 : ఎలక్ట్రానిక్ పరిశ్రమలు మూత ప్రాణాంతక కరోనా పేరు మార్పు -
కరోనా : నిర్బంధంలో 200 మంది భారతీయులు
టోక్యో/బీజింగ్/జెనీవా: కరోనా భయంతో జపాన్ ప్రభుత్వం యెకోహోమా తీరంలో నిలిపివేసిన నౌకలోని భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ‘డైమండ్ ప్రిన్సెస్’ అనే ఆ నౌకలో నిర్బంధంలో ఉన్న బినయ్ కుమార్ సర్కార్ అనే భారతీయుడు తమను కాపాడాలంటూ సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు. 200 మంది భారతీయులతో పాటు నౌకలో అంతా కలిపి 3,700 మంది ఉన్నారనీ, వీరిలో 62 మందికి కరోనా సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ కాగా తమ నౌకను అధికారులు దిగ్బంధించినట్లు బినయ్ పేర్కొన్నాడు. మరింత మందికి వైరస్ సోకే ప్రమాదం ఉండడంతో తమను కాపాడాలంటూ బినయ్ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఓ వీడియోను ఫేస్బుక్లో పెట్టారు. ‘మేం కోరుకుంటోంది ఒక్కటే, దయచేసి మమ్మల్ని ఈ నౌక నుంచీ, ఈ నిర్బంధం నుంచీ వేరు చేసి, ప్రత్యేకంగా ఉంచండి. మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. మాకు భయంగా ఉంది. దయచేసి సాయం చేయండి’అని అందులో ఉంది. వైరస్ ఇంకా మరింత మందికి వ్యాపించకుండా ఉంటే, ఫిబ్రవరి 19 వరకు వీరందరినీ వేరుగా ఉంచాల్సి ఉంటుందని నౌకలోని జపాన్ అధికారులు శుక్రవారం చెప్పారు. ‘జపాన్ కాలమానం ప్రకారం ఫిబ్రవరి 6వ తేదీ రాత్రి 7 గంటల వరకు భారతీయులెవ్వరికీ కరోనా సోకలేదు. ప్రస్తుతం నౌకలోని చివరి బృందానికి పరీక్షలు నిర్వహిస్తున్నాం’అని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. 723కు చేరిన కరోనా మృతులు చైనాలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 723కు చేరింది. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన కేసులు 34,598కు చేరాయి. తాజాగా, 1,280 మంది వ్యాధిగ్రస్తుల పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు చైనా నేషనల్ హెల్త్క మిషన్ ప్రకటించింది. చైనాలో కరోనా వైరస్ బారిన పడి అమెరికాకు చెందిన ఓ మహిళ, జపనీయుడొకరు మృతి చెందారు. కరోనాతో చైనాలో విదేశీయులు మరణించిన తొలి ఘటన ఇదే. కరోనాకు శాశ్వత పేరుపై తర్జనభర్జన ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త రకం వైరస్ కరోనాకు శాశ్వతంగా ఏం పేరు పెట్టాలనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తర్జనభర్జన పడుతోంది. కరోనా వైరస్ ప్రారంభమైన వుహాన్ నగరం పేరు గానీ, అటు చైనా ప్రజల మనోభావాలు గానీ దెబ్బతినకుండా ఉండేలా పేరు పెట్టాలని జాగ్రత్త వహిస్తోంది. ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పేర్కొన్న ఈ వ్యాధికి ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ అధికారికంగా తాత్కాలిక పేరు ‘2019–ఎన్కోవ్ అక్యూట్ రెస్పిరేటరీ డిసీజ్’అని పెట్టింది. ‘ఎన్కోవ్’అంటే ‘నావల్ కరోనావైరస్’అని అర్థం అని తెలిపింది. ‘పేరుతో ప్రదేశానికి ఎలాంటి సంబంధం లేకుండా ఉండేలా ఓ పేరును పెట్టడం చాలా ముఖ్యమని మేం భావించాం’అని డబ్ల్యూహెచ్‌వో అత్యవసర వ్యాధుల విభాగం అధిపతి మరియా తెలిపారు. శాశ్వత పేరు పెట్టడంపై నిర్ణయం కొద్దిరోజుల్లోనే తీసుకుంటామని, డబ్ల్యూహెచ్‌వోతో పాటు ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్ (ఐసీటీవీ) కరోనా నిపుణుల నిర్ణయం మేరకు ఉంటుందని ఆమె వెల్లడించారు. ఎయిర్ హగ్ ! కరోనా బాధితులకు సేవలు అందించేందుకు ఆస్పత్రిలో చేరిన నర్స్ లియు హైయాన్ తన కూతురు చెంగ్‌ను 10 రోజుల నుంచి కలవలేదు. శనివారం చెంగ్ ఆస్పత్రి వద్దకు వచ్చింది. అయితే కరోనా కారణంగా ఇద్దరు కలవడం కుదరకపోవడంతో దూరం నుంచే కౌగిలింత ఇచ్చినట్లుగా ఏడుస్తూ చేతులు చాచి భావోద్వేగానికి గురయ్యారు. ‘మమ్మీ వైరస్‌తో పోరాడుతోంది.. తగ్గగానే ఇంటికి వస్తుంది’ అని చెబుతూ.. చక్కగా, మంచిగా ఉండాలని కుమార్తెకు సూచించారు. కరోనా కారణంగా తల్లీకూతుళ్లు కన్నీళ్ల నడుమ జరిగిన ఈ ఎయిర్ హగ్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. తల్లి, కూతుళ్ల ఎయిర్ హగ్ -
‘సుమితొమొ’తో 4 ఒప్పందాలు
జపాన్ కంపెనీలతో చంద్రబాబు మంతనాలు ⇒ విద్యుత్ ఉత్పత్తి, రాజధానిలో మౌలిక సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణ రంగాల్లో సుమిటోమీ సంస్థతో ఒప్పందాలు ⇒ యొకోహోమా పోర్టు సందర్శన..రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై అధ్యయనం ⇒ నేడు జపాన్ ప్రధానితో చంద్రబాబు భేటీ.. రేపు రాష్ట్రానికి తిరుగుముఖం సాక్షి, హైదరాబాద్: జపాన్ దేశ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆ దేశానికి చెందిన ‘సుమితొమొ’తో సంస్థతో గురువారం నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి, కొత్త రాజధానిలో మౌలిక సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణ అంశాలపై ఈ ఒప్పందాలు జరిగాయి. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున మునిసిపల్, పరిశ్రమలు, ఇంధన శాఖల ముఖ్య కార్యదర్శులు, సుమితొమొ సంస్థ అధికారులు సంతకాలు చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం గత నాలుగు రోజులుగా జపాన్‌లో పర్యటిస్తోంది. ఈ బృందం గురువారం నాడు సుమిటోమో సంస్థను సందర్శించినట్టు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం జిల్లా బారువలో 4,000 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం వల్ల రాష్ట్రం సంపూర్ణంగా మిగులు విద్యుత్ ఉండే రాష్ట్రంగా మారుతుందని.. ‘సుమితమొ’ సంస్థ సహకారంతో ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి జైకా, నెడో, జేబీఐసీ ఆర్థిక సాయం అందిస్తున్నాయని సీఎం అధికారిక ప్రకటనలో తెలిపారు. ‘కొత్త రాజధాని నగరంలో రవాణా, తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, గృహావసరాలకు సహజ వాయు సరఫరా తదితర సౌకర్యాల కల్పనకు ‘సుమితొమొ’ సహకరిస్తుంది. చిన్న కమతాల సాగుకు పనికొచ్చే ఆధునిక యంత్రసామగ్రి సరఫరా, ఎరువులు, రసాయనాల వినియోగం, వ్యవసాయం యాంత్రీకరణ కేంద్రాల ఏర్పాటు, ఆధునిక సాగు విధానాలను అందించేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. తమ సంస్థకు ఏపీ కీలకమైన రాష్ట్రమని, విజ్జేశ్వరం పవర్ ప్లాంట్ ఏర్పాటులో భాగస్వామ్యం కూడా ఉందని ఆ సంస్థ చైర్మన్ కజువా ఓహ్మోరి చెప్పినట్లు ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణలో పేరెన్నికగన్న వరి ఉత్పత్తి కంపెనీ క్యుబోటో కార్పొరేషన్‌ను చంద్రబాబు బృందం సందర్శించింది. కంపెనీ డెరైక్టర్ యూచీ కిటావో తమ సంస్థ ఉత్పత్తుల గురించి వివరించారు. ఏపీలో ఆధునిక సాగు విధానాలు ప్రవేశపెట్టేందుకు, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు సహకరించాలని బాబు ఆ సంస్థను కోరారు. యొకోహోమా పోర్టు సందర్శన.. జపాన్‌లో యొకోహోమా పోర్టును చంద్రబాబు బృందం సందర్శించింది. జపాన్‌లో తయారైన ఆటోమొబైల్ పరికరాలను ఈ పోర్టు నుంచే విదేశాలకు ఎగుమతి చేస్తారు. జపాన్‌లో అనుసరిస్తున్న పన్ను విధానం, ఓడరేవుల ద్వారా జరుగుతున్న ఎగుమతి, దిగుమతుల గురించి చంద్రబాబు బృందానికి టకాషీ వివరించారు. హుద్‌హుద్ తుపాను వల్ల తీవ్రంగా దెబ్బతిన్న విశాఖ పోర్టు కంటెయినర్ టెర్మినల్ పునర్నిర్మాణంపై అక్కడి అధికారులతో బాబు చర్చించారు. జైకా ప్రతినిధులతో భేటీ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ప్రతినిధులతో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. భారతదేశంతో జపాన్ సంబంధాలు గతంలో భిన్నంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో మాత్రం ఉజ్వలంగా ఉంటాయన్నారు. తమది కొత్త రాష్ట్రమని, అందులో కొత్త రాజధాని నిర్మాణంతో పాటు పెట్టుబడులకు అనేక నూతన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ తయారీలో సహకరించాలని కోరారు. ఏపీలో ప్రత్యేకంగా జైకా కార్యాలయాన్ని నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జపనీస్ ఇండస్ట్రియల్ పార్కుకు ఒక స్పెషల్ అథారిటీని ఏర్పాటు చేస్తానని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో వాటర్ ట్రీట్మెంట్కు సహకరిస్తామని జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ (జేబీఐసీ) సీఈఓ వటానబే చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణంలో, ఎయిర్‌పోర్టులు, పోర్టుల అభివృద్ధిలో జపాన్ కంపెనీలు భాగస్వాములు కావటానికి కావల్సిన పరపతి సౌకర్యాలను కల్పించాలని ఆయనను చంద్రబాబు కోరారు. ఆయన శుక్రవారం నాడు జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో భేటీ కానున్నారు. శనివారం రాష్ట్రానికి తిరుగుప్రయాణం కానున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పొంగూరి నారాయణ, ఎంపీలు గల్లా జయదేవ్, సి.ఎం.రమేష్, ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ప్రభుత్వ సలహాదారులు పరకాల ప్రభాకర్, లక్ష్మీనారాయణ, సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, సీనియనిర్ ఐఏఎస్ అధికారులు ఎస్.పి.టక్కర్, జె.ఎస్.పి.ప్రసాద్, ఇంటెలిజెన్స్ డీజీపీ అనురాధ ఉన్నారు.