న్యూఢిల్లీ/టోక్యో : కరోనా వైరస్ భయంతో ప్రయాణికుల నౌక ‘డైమండ్ ప్రిన్సెస్’ను కొద్ది రోజులుగా జపాన్‌లోని యెకోహోమా తీరంలోనే నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నౌకలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 175కు చేరింది. ఆ నౌకలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 3,700 మంది ఉండగా.. అందులో 138 మంది భారతీయులు ఉన్నారు. దీంతో వారి ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆ నౌకలో ఉన్న భారత్‌కు చెందిన సెక్యూరిటీ ఆఫీసర్ సోనాలి ఠాకూర్‌ను సోమవారం నుంచి ఒంటరిగా నిర్భందించారు. దీంతో తమకు సాయం చేయాల్సిందిగా సోనాలి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందడం మాలో భయాన్ని కలిగిస్తోంది. మాకు కూడా ఆ వైరస్ సోకుంతుందనే ఆందోళనలో ఉన్నాం. మేము కరోనా వైరస్ బారిన పడకుండా.. క్షేమంగా భారత్‌కు చేరుకోవాలని కోరుకుంటున్నామ’ని తెలిపారు.
సోనాలి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నౌకలో కొత్తగా 39 మందికి కరోనా వైరస్ సోకింది. కేంద్ర ప్రభుత్వం మమల్ని భారత్‌కు తీసుకెళ్లి.. అక్కడ నిర్భంధించాలని కోరుతున్నాం. లేకపోతే కనీసం కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించడానికి.. మరికొంతమంది వైద్య సిబ్బందినైనా పంపండి. మేము క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నాం. నా పరిస్థితి గురించి ముంబైలోని కుటుంబసభ్యులు, స్నేహితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నేను క్షేమంగా తిరిగిరావాలని నిత్యం ప్రార్థనలు చేస్తున్నారు. నా తల్లిదండ్రులకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను.. ధైర్యంగా ఉండండి. మీ కుమార్తె త్వరలోనే క్షేమంగా ఇంటికి తిరిగివస్తుంద’ని అన్నారు.
డైమండ్ ప్రిన్సెస్ నౌకలోని భారత ప్రయాణికులు ఇదివరకే తమకు సాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. పరిస్థితి ఇలాగే కొనసాగితే నౌకలోని మరింత మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని నార్త్ బెంగాల్‌కు చెందిన చెఫ్ బినయ్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పెట్టారు. ‘మేం కోరుకుంటోంది ఒక్కటే, దయచేసి మమ్మల్ని ఈ నౌక నుంచీ, ఈ నిర్బంధం నుంచీ వేరు చేసి, ప్రత్యేకంగా ఉంచండి. మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. మాకు భయంగా ఉంది. దయచేసి సాయం చేయండి’అని అందులో బినయ్ విజ్ఞప్తి చేశారు. దీనిపై టోక్యోలోని భారత ఎంబసీ స్పందిస్తూ.. ఆ నౌకలోని భారతీయుల పరిస్థితిని నిరంతంరం సమీక్షిస్తున్నట్టు పేర్కొంది.
చదవండి : కోవిడ్-19 : 18 నెలల్లో తొలి వ్యాక్సిన్
Comments
Please login to add a commentAdd a comment